* బిల్లులు చెల్లించలేదని హెచ్‌ఎంపై ఆగ్రహం
* విద్యార్థులను బయటకు పంపించి తరగతి గదులకు తాళాలు
ప్రజాశక్తి - టెక్కలి రూరల్: పాఠశాల మరమ్మతు పనుల బిల్లులు చెల్లించలేదని అధికార పార్టీకి చెందిన చోటా నాయకుడు ఉగ్రరూపం ప్రదర్శించాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, తాను పనులు చేసిన తరగతి గదిలో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయులు, వింటున్న విద్యార్థులను బయటకు పంపించి మరీ గదికి తాళాలు వేసిన ఘటన టెక్కలిలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఎన్‌టిఆర్ కాలనీకి చెందిన వైసిపి నాయకుడు, వార్డు సభ్యురాలి భర్త దుప్పల శ్రీనివాస్ స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2019-20, 2020-21 సంవత్సరాల్లో మరమ్మతులు పనులు చేశారు. ఇందుకు సంబంధించిన సుమారు రూ.1.43 లక్షల బిల్లులు చెల్లించాలని పాఠశాల సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పాఠశాలలో గతంలో ప్రధానోపాధ్యాయులుగా చేసిన వారు బదిలీ కావడంతో, ఇటీవల ఆ స్థానంలో కె.విజయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. శ్రీనివాస్ బుధవారం పాఠశాలకు వెళ్లి తనకు రావాల్సిన బిల్లులు చెల్లించాలని హెచ్‌ఎంను కోరారు. తాను ఇటీవలే బాధ్యతలు చేపట్టానని, పనుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాక వారి సూచనల మేరకు చర్యలు తీసుకోగలనని చెప్పారు. దీంతో ఆయన కోపం నషాళాన్ని తాకింది. బిల్లు చెల్లించాలంటే వాళ్లకు చెప్పాలి, వీళ్లకు చెప్పాలి అంటారేంటి అని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు ఎలా రాబట్టుకోవాలో తనకు తెలుసునని ఆవేశంతో ఊగిపోతూ తాను మరమ్మతు పనులు చేపట్టిన రెండు తరగతి గదుల్లోకి వెళ్లి పాఠాలను బోధిస్తున్న ఉపాధ్యాయులు ఎం.శ్రీరామ్, బి.హేమలతను, విద్యార్థులను బలవంతంగా బయటకు పంపించారు. అనంతరం పాఠశాల గదులకు తాళం వేసి వెళ్లిపోయారు. దీనిపై ప్రశ్నించిన హెచ్‌ఎంపై దురుసుగా ప్రవర్తించారు. విషయాన్ని హెచ్‌ఎం విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఎంఇఒ-2 డి.చిన్నారావు పాఠశాలలో విచారణ చేపట్టారు. జరిగిన విషయాలను హెచ్‌ఎం, పాఠశాల సిబ్బందిని, స్థానికులను అడిగి తెలుసుకున్నారు.










