ప్రజాశక్తి - జగ్గంపేట రూరల్, తాళ్లరేవు
జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ కుటుంబంపై వైసిపి సోషల్ మీడియా ఇన్‌ఛార్జి వర్రా రవీంద్రరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై కిర్లంపూడి జనసేన నాయకులు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఉలిసి ఐరాజు మాట్లాడారు. వ్యాఖ్యలు చేసే ముందు వైసిపి నాయకుల కుటుంబాల్లోనూ మహిళలు ఉన్నారనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తమకు విలువలతో కూడా రాజకీయాలు నేర్పారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు చెప్పలేని వారే ఇలా చేస్తారన్నారు. సాటి మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం వైసిపి నాయకులపై కిర్లంపూడి ఎస్‌ఐ రఘునాథరావుకి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జి.ప్రభాకర్, డేగల విజరు, పిడుగు జయబాబు, ఎద్దు అర్జున్, కూనపరెడ్డి నాని, తదితరులున్నారు. తాళ్లరేవు మండలం కోరంగి పోలీస్‌స్టేషన్‌లో జనసేన మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు ఆధ్వర్యంలో నాయకులు వైసిపి నాయకుడు వర్రా రవీంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. సోషల్‌మీడియాలో వర్రా చేసిన వాఖ్యలను వారు తీవ్రస్థాయిలో ఖండించారు. ఈ కార్యక్రమంలో వి.వీర, వి.ప్రసాద్, కె.నాని, జి.అనిల్, ఎస్.కుమార్, ఎం.బోసు, పి.సూరిబాబు, టి.త్రిమూర్తులు, వీర మహిళలు పాల్గొన్నారు.










