ప్రజాశక్తి-ప్రత్తిపాడు : మండలంలోని పాత మల్లాయపాలెంలో దళితుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వైసిపి నాయకులపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా పాత మల్లాయపాలెంలో జరిగిన సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ఎస్‌సి కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదుకు జిల్లా ఎస్పీని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్‌ప్రసాద్ ఆదేశించారు. దీనిపై వివరాల ప్రకారం.. పాతమల్లాయపాలేనికి చెందిన నీలం జ్యోతి సాగర్ గ్రామంలోని మరికొందరితో కలిసి ఈనెల14న అంబేడ్కర్ జయంతి నిర్వహించారు. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కొంతమందితో కలిసి జ్యోతిసాగర్ కూర్చుని ఉండగా స్థానిక వైసిపి నాయకులు యేనిరేడ్డి శంకరరెడ్డి, తంభా కోటిరెడ్డి, కాసు సీతారామిరెడ్డి, యేనిరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు తమ అనుచరులతో వచ్చి జ్యోతి సాగర్, నీలం ప్రవీణ్ కుమార్, నీలం వినరు, నీలం అంటోనితో గొడవపడ్డారు. కులం పేరుతో దూషించి వారిపై ఇనుప రాడ్లతో దాడి చేశారు. దీనిపై బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ గురువారం రాత్రి ప్రత్తిపాడుకు వచ్చి స్థానిక అధికారులతో చర్చించారు. పాతమల్లాయపాలెం ఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు.
మీడియాతో మాట్లాడుతున్న ఎస్పీ










