Nov 16,2023 21:29

కలెక్టర్‌కు రాసిన లేఖను చూపుతున్న కాలవ శ్రీనివాసులు

        ప్రజాశక్తి-రాయదుర్గం రూరల్‌    విలువైన ప్రభుత్వ స్థలాలను వైసిపి నాయకులు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. మండల పరిధిలోని 74-ఉడేగోళం గ్రామంలో వైసిపి నాయ కుడు బోర్‌వెల్‌ నాగిరెడ్డి కబ్జా చేసిన స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం కాలవ విలేకరు లతో మాట్లాడుతూ ఉడేగోళం పంచాయతీ పరిధిలోని సర్వే నెం:77లో 5.3 ఎకరాల భూమిలో కొంత స్థలాన్ని గతంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించారన్నారు. మిగిలిన స్థలాన్ని గ్రామ ప్రయోజ నాల కోసం ఉపయోగించాలని గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. ఆయన ప్రధాన అనుచరుడు నాగిరెడ్డి కబ్జా చేసిన స్థలంపై ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు. కాలవతో పాటు నాయకులు టంకసాల హనుమంతు, శివానంద, విజరుకుమార్‌, ఓబయ్య, శ్రీకంఠప్ప, మహానంది, మంజునాథస్వామి, నల్లయ్య, తిప్పేస్వామి, చిన్నసూరయ్య, తమ్మయ్య ఉన్నారు.
అక్రమ లే-అవుట్లపై 'కాపు' అడ్డగోలు ఆరోపణలు
నాలుగేళ్లలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సహజ వనరులను కొల్లగొట్టి తప్పుడు మార్గాల్లో కోట్ల రూపాయలు ఆర్జించి, తనపై అభాండాలు వేస్తున్నారని కాలవ పట్టణంలోని తన నివాసంలో ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. ప్రశాంతమైన రాయదుర్గంలో విచ్చలవిడిగా దందాలు, అక్రమాలు చేస్తున్న కాపు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడన్నారు. 'కాపు' సవాల్‌ను స్వీకరించి అక్రమ లే-అవుట్లపై సమగ్ర విచారణ చేయించాలని కలెక్టర్‌కు గురువారం మెయిల్‌ ద్వారా లేఖ పంపానన్నారు. అక్రమ లేఅవుట్లపై ఎమ్మెల్యే కూడా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కాలవ సవాల్‌ చేశారు.