Mar 28,2023 00:01

దీక్ష చేపడుతున్న గ్రామస్తులు, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:మండలంలోని చింతలవీధి పంచాయతీ నడింవీటి గ్రామంలో వైసిపి కార్యాలయ నిర్మాణ పనులను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు సోమవారం సంఘటనా స్థలం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, 2 ఎకరాల రైతుల సాగు భూమిని ఆ పార్టీకి చట్ట విరుద్ధంగా కేటాయించారని, దీని అనుమతులను రద్దు చేయాలన్నారు. గత ఏడాది దీన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు నిర్వహించిన గ్రామ సభలో వ్యతిరేక తీర్మానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా నాయకులు లింగేరి సుందరరావు మాట్లాడుతూ, తక్షణమే ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌, ఏపిఓ స్పందించి వైసీపీ కార్యాలయం నిర్మాణపు పనులను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ భూమిలో భూమిలో నడిం వీధి గ్రామానికి చెందిన వారు కాపీ, సిలర్‌ మొక్కలు సాగు చేసుకొని జీవనాధారం పొందుతున్నారని తెలిపారు. స్థానిక గిరిజన ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా జీవో 354 జారీ చేసి, షెడ్యూల్డ్‌ ఏరియా నిబంధనలను తుంగలో తొక్కారని విమర్శించారు.తక్షణమే నిర్మాణ పనులు నిలుపుదల చేయకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎం.బాలన్న, బిమన్న, రాజు, సతీష్‌, మహేష్‌, పొల్లన్న, సుమన్‌, వెంకటరావు, నడుంవీది, ఉబ్బెటి పుట్టు గ్రామస్తులు పాల్గొన్నారు.