Aug 30,2022 23:14

ర్యాలీలో నినాదాలు చేస్తున్న సిపిఎం నాయకులు

ప్రజాశక్తి -ములగాడ : పన్నుల భారం మోపిన వైసిపి కార్పొరేటర్లను ప్రజలే నిలదీయాలని సిపిఎం నాయకులు ఎ.సత్యారావు పిలుపునిచ్చారు. పన్నుల భారం రద్దుచేయాలంటూ 40 వార్డులో సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యారావు మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఎన్నో వాగ్ధానాలు ఇచ్చిన వైసిపి నేతలు కార్పొరేటర్లు అయ్యాక ఆస్థి విలువను బట్టి ఇంటిపన్ను వేశారని విమర్శించారు. 15శాతం ఇంటి పన్ను పెంచడంతోపాటు అదనంగా చెత్తకు పన్ను వేశారని తెలిపారు. ఇంటిపన్ను ఆరు నెలకు ఎంత కడుతున్నామో దానిప్రకారం ఐదు భాగాలుగా విభజించి పన్ను భారం వేస్తూ కౌన్సిల్‌లో తీర్మానం చేశారని పేర్కొన్నారు. చెత్తపన్నును ఇంటిపన్నుతో ముడిపెట్టిన వైసిపి ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఎఎస్‌సి కాలనీలో పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మల్కాపురం జోన్‌ కార్యదర్శి పి.పైడిరాజు, జోన్‌ నాయకులు కె.పెంటారావు, కార్యకర్తలు ఎం.కోటి, కె.నూకరాజు, ఎ.కిరణ్‌, ఎస్‌ఎస్‌ అప్పారావు, ఎస్‌.వాసు, జి.నరేష్‌, కె.నగేష్‌, జి.రామకృష్ణ, ఎస్‌.రాజు, ఎస్‌.లక్ష్మణ్‌, ఆర్‌.వెంకటేష్‌ పాల్గొన్నారు.