ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు కార్పొరేషన్‌లో వైసిపి కార్పొరేటర్లు అలకబూనారు. దీంతో నగరంలో అభివృద్ధి పనుల ఆమోదంపై ప్రతిష్ఠంభన ఏర్పడింది. రూ.20 లక్షలు దాటి జరిగే పనులకు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపాల్సి ఉంది. ఈ సమావేశం మూడు సార్లుగా వాయిదా పడుతోంది. వైసిపికి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు ఈ సమావేశానికి రావడం లేదు. గతనెల రోజులుగా ఈ తంతు జరుగుతోంది.
అభివృద్ధి పనుల్లో మేయర్, ఎమ్మెల్యేలే కీలక భూమిక పోషిస్తున్నారని కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారు. కార్పొరేటర్లు కూడా పనుల్లో తమకు 5 శాతం ఇవ్వాలని కాంట్రాక్టర్లను వత్తిడి చేస్తున్నారని తనదృష్టికి వచ్చినట్టు ఒక ప్రజా ప్రతినిధి చెప్పారు. మేయర్, ఎమ్మెల్యేలకు కూడా పర్సంటేజిలు ఉన్నాయని ఆరోపణలు విన్పిస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల వాటాలపై నగరంలో ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. గాంధీ పార్కు ఆధునీకీకరణకు రూ.5 కోట్ల వెచ్చించడంపైనా ఆరోపణలు వస్తున్నాయి. వైసిపి నేతల అవినీతిపై టిడిపి నాయకులు నశీర్ అహ్మద్, కోవెలమూడి రవీంద్ర, టిడిపి కార్పొరేటరు సోమవారం జిల్లా కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు.
మేయర్ ఆదేశాలంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల బస్టాండ్‌లో జరుగుతున్న నిర్మాణాలకు నోటీసులు ఇవ్వగా వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయించారు. కోర్టు కమిషనర్‌కు నోటీసులు ఇచ్చింది. దీంతో ఆగ్రహించిన కమిషనర్... టౌన్ ప్లానింగ్ ఇన్‌స్పెక్టర్ రసూల్‌ను సస్పెండ్ చేశారు. నగరంలో జరుగుతున్న నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లఘిస్తే నోటీసులిచ్చి జరిమానాల ద్వారా కార్పొరేషన్‌కు ఆదాయం కల్పించాల్సిన అధికారులు కార్పొరేటర్ల ద్వారా సంబంధిత యజమానులను బెదిరింప చేసి పెద్ద ఎత్తున సొమ్ములు దండుకుంటున్నారు. తిలా పాపం తలా పిడికెడు చందంగా అధికారులు కొంత మంది కార్పొరేటర్లు పంచుకుంటున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. నగరంలో ప్రజా ప్రతినిధులుకొంత మంది బినామీ పేర్లతో పనులు దక్కించుకుంటున్నారని తమకు ఏమీ ఉండటం లేదని పలువురు కార్పొరేటర్లు వాపోతున్నారు.
మొత్తం మీద కార్పొరేషన్‌లో అవినీతి అక్రమాలు సిఎం కార్యాలయానికి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వెళ్తున్నాయి. అధిష్టానం ఆదేశాలతో పార్టీ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని ఎంపి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ఇటీవల మేయర్, ఎమ్మెల్యే ముస్తాఫాకు గట్టిగానే క్లాసు తీసుకున్నారు. అభివృద్ధి పనుల్లో తమకు ప్రాధాన్యం లేదని అలిగిన కార్పొరేటర్లు మేయర్, ప్రజా ప్రతినిధులపై గుర్రుగా ఉన్నారు. అయితే గుంటూరు నగరంలో జరుగుతున్న వ్యవహారాలపై వైసిపి కార్యకర్తలే మంగళవారం నుంచి ప్రారంభం కానున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా ఫిర్యాదులు చేసేందుకు సిద్ధం అవుతున్నారని తెలిసింది.










