ప్రజాశక్తి - అద్దంకి
వైసిపి నేతల ఇసుక దాహం రాష్ట్ర ప్రజల ఉపాధికి శాపంగా మారిందని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు పిలుపుమేరకు మండలం మోదేపల్లిలోని ఇసుక అక్రమ మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ ఇసుక సత్యాగ్రహం నిర్వహించారు. పేదలకు ఎంతో చేసేశానంటూ గొప్పలు చెప్పకుంటున్న జగన్‌రెడ్డి అసలు పేదవాడికి అవసరమైన కూడు, గూడు, గుడ్డ లాగేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి ఇసుక పాలసీ వైసిపి నేతల ఆర్ధిక దాహం తీరుస్తుందని అన్నారు. ఇసుక రీచ్‌లను వైసిపి నేతల ఆదీనంలో పెట్టుకుని జేబులు నింపుకుంటున్నారని అన్నారు. రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందన్నారు. రాష్ట్రం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని అన్నారు. జగనన్న వచ్చి పేద కార్మికులకు అన్నం లేకుండా చేశాడని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం హయాంలో ఇసుక ద్వారా మహిళల ఆదాయాన్ని పెంచడంతో పాటు స్థానిక సంస్థల ఆదాయం కూడా పెంచామని అన్నారు. ఇసుక క్వారీల్లో డ్వాక్రా సంఘాలకు, రైతు సాధికార సంస్థలకు, స్థానిక సంస్థలకు ప్రయోజనం కల్పించామని అన్నారు. సామాన్యునికి ఇసుక భారం కాకూడదనే ఉద్దేశంతో టిడిపి ఇసుకను 2016 మార్చి 2 నుంచి ఉచితంగా అందజేసిందని గుర్తుచేశారు. జగన్మోహన్‌రెడ్డి స్వార్థంతో తమ మద్దతుదారులకు దోచి పెట్టే విధంగా ఇసుక పాలసీ మార్చేశారని అన్నారు.










