Aug 14,2023 20:04

ప్రజాశక్తి - కాళ్ల
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంట కాలువల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని ఎంఎల్‌ఎ మంతెన రామరాజు విమర్శించారు. మండలంలోని కలవపూడి, మోడీ గ్రామాల్లో టిడిపి 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతోపాటు పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, గ్యాస్‌ ధరలు, ఇంటి, చెత్త పన్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎంఎల్‌ఎ మంతెన రామరాజు మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వ హయాంలో కలవపూడిలో ఆసుపత్రి నిర్మాణానికి నిధులు మంజూరైనా ఈ ప్రభుత్వంపై నమ్మకం లేక నిర్మాణానికి ఏ కాంట్రాక్టరూ ముందుకు రావడం లేదన్నారు. గ్రామాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులను సైతం వైసిపి ప్రభుత్వం రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి నిరంకుశ పాలనతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండలాధ్యక్షుడు జివి.నాగేశ్వరరావు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జులు తోట ఫణిబాబు, అడ్డాల శివరామరాజు, సర్పంచి గేదల జాన్‌, మంతెన పెద నరసింహారాజు, త్రిమూర్తులరాజు, ముదుండి మణిబాబు పాల్గొన్నారు.