Aug 12,2023 21:11

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా అధ్యక్షులు రమణారావు

ప్రజాశక్తి - సాలూరు : దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు కార్యదర్శి ఎన్‌ వై నాయుడు విమర్శించారు. పట్టణంలో శనివారంనిర్వహించిన సిఐటియు సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్స్‌ కార్మికులకు నష్టదాయకంగా ఉన్నాయన్నారు. గతంలో ఉన్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అందరికీ అమలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాల అమ్మకం, ప్రైవేటీకరణ, మానిటైజేషన్‌ విధానాలను విడనాడాలని డిమాండ్‌ చేశారు. సంఘం పెట్టుకునే హక్కు, బేరసారాలాడే హక్కులను కాల రాయడం జరుగుతుందన్నారు. అసంఘటిత కార్మికులకు, స్కీం వర్కర్లందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, సామాజిక భద్రత కల్పించాలని, రెగ్యులర్‌ చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలని కోరారు. సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడంలో వెనకాడడం సరైంది కాదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం లేదని, కౌలు రైతులకు రుణ సౌకర్యం కల్పించి, వ్యవసాయ కార్మికులకు రూ.600 వేతనంపై కనీసం 200 రోజులు ఏడాదిలో పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకపోతే రాబోవు రోజుల్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సిఐటియు మండల సమన్వయ కమిటీ కన్వీనర్‌ టి.రాముడు, కమిటీ సభ్యులు వెంకన్న, భాస్కరరావు, స్వప్న, దేవి, సీత తదితరులు పాల్గొన్నారు.