కడప అర్బన్ : కృష్ణా నీటి వివాదాలపై ఏర్పాటైన ట్రిబ్యునల్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని పునఃపంపిణీ పేరుతో ఎపి, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబునల్‌కు అదనపు బాధ్యతలను కట్టబెట్టి తద్వారా తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బిజెపి కుట్రలను ఎండగడతామని, అడుగడుగునా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న స్పందించని వైసిపి ఎంపీలు రాజీనామా చేయాలని సోమవారం కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనలో అఖిలపక్ష నేతలు ఎన్.తులసిరెడ్డి, గాలి చంద్ర, లక్ష్మిరెడ్డి, సత్తార్, రాము, రమణయ్య, దస్తగిరిరెడ్డి, గురప్ప, నరసింహులు డిమాండ్ చేశారు. మూడు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇదివరకే బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను యథావిధిగా అమలు చేస్తూనే మిగులు జలాలను కూడా 448 టిఎంసిలుగా లెక్కగట్టి పంపిణీ చేయా లన్నారు. మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలుగొండ, తెలుగుగంగ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నదని తెలిపారు. రాయలసీమ ద్రోహి జగన్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగ డతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బారెడ్డి, వెంకట శివ, వీరశేఖర్, నాగసుబ్బారెడ్డి, భాగ్యలక్ష్మి, మైనుద్దీన్, మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.










