
మదనపల్లె అర్బన్: గత కొన్ని రోజులుగా వైసిపి చేస్తున్న దాష్టీకాన్ని విపక్షాలు, ప్రజలు అందరూ గమనిస్తున్నారని జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి అన్నారు. కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజుల క్రితం ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రేపో మాపో నన్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది అన్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం అవుతాందన్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిని, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని సరైన ఎఫ్‌ఐఆర్ లేకుండా, స్కాం జరిగిందని, ఎటువంటి ఆధారాలు లేకుండా సాక్షాధారాలు లేకుండా 73 ఏళ్ల పెద్దాయనను అర్ధరాత్రి అక్ర మంగా అరెస్టు చేయడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండి స్తుందన్నారు. సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు గడ్డం లక్ష్మిపతి,ఐటీ విభాగ నాయకులు జగదీష్, లక్ష్మినారాయణ కల్లూరు,జంగాల గౌతమ్, గండికోట లోకేష్, నవాజ్, జనర్దన్ పాల్గొన్నారు.
పీలేరు: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు నైతిక చర్యగా భావిస్తున్నామని, ఆ అక్రమ అరెస్టును జనసేన పార్టీ తరఫున దీన్ని ఖండిస్తున్నామని జనసేన ఇన్‌ఛార్జి దినేష్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత వైద్యాధికారైన డాక్టర్ సుధాకర్‌ని పిచ్చివాడిని చేసి చంపేశాడని, సొంత పార్టీ ఎంపీ రఘురామ కష్ణంరాజుని అరెస్టు చేయించి జైలుకు పంపి అక్కడ చంపించబోయాడని, జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను విశాఖపట్నంలో పర్యటించడానికి అవకాశం ఇవ్వకుండా అడ్డు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపితే జీర్ణించుకోలేకపోతున్నాడని చెప్పారు. సొంత బాబారుని చంపిన వాడిని పక్కన పెట్టుకున్న సిఎం నార్త్ కొరియా కిమ్ జాన్ లా తయారవుతున్నాడని ఎద్దేవా చేశారు.