Oct 26,2023 23:01

బహిరంగ సభలో మాట్లాడుతున్న మంత్రి జోగి రమేష్‌

ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ : తెనాలి మండలం కొలకలూరు నుంచి ప్రారంభమైన సామాజిక సాధికార బస్సుయాత్రలో వైసిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు జోగిరమేష్‌, ఆదిమూలపు సురేష్‌, ఎంపి ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్‌, కల్పలత, పోతుల సునీత, ఎమ్మెల్యేలు ఆన్నాబత్తుని శివకుమార్‌, హఫీజ్‌ ఖాన్‌, కిలారి రోశయ్య, ఆప్కో చైర్మన్‌ గంజి చిరంజీవి, వైసిపి గుంటూరు జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, జెడ్‌పి చైర్‌పర్సన్‌ హెనీక్రిస్టినా తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ నేతత్వంలో నిర్వహించిన యాత్రలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. కొలకలూరు నందివెలుగు మీదుగా కంచర్లపాలెం, సోమసుందరపాలెం, కఠెవరం, ముగించుకొని తెనాలి పురవేదిక వద్ద బహిరంగ సభ నిర్వహించారు. గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ చంద్రబాబు అవినీతి బండారం ఇప్పటికి బయటపడిందన్నారు. అన్ని వ్యవస్థలను మ్యానేజ్‌ చేసుకుని ఇంత కాలం నీతి పరుడుగా చలామణి అయ్యారని ఇప్పుడు ఆయన అవినీతి చిట్టా ఒక్కొటిగా బయటకు వస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సామాజిక సాధికార బస్సు యాత్రను రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఒకేసారి ప్రారంభం చేశామన్నారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం కోస్తాంధ్రలో తెనాలి నుండి రాయలసీమలో సింగనమల నుంచి బస్సు యాత్ర ప్రారంభం చేశామన్నారు. నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివద్ధి సంక్షేమాలపై ప్రజలకు తెలియచేసేందుకు ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన మేలుపై ఈ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు మూడు ప్రాంతాల్లోనూ మూడుసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు సమన్వయకర్తల ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకమవుతామన్నారు. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టినట్లు తెలియజేసారు. రాష్ట్ర పట్టణాబివద్ది శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ అభివద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళతో దూసుకుపోతున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సాధికారిత బస్సు యాత్ర ద్వారా చేరువవుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు, సామాజిక న్యాయానికి జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలన అవినీతి మయం అన్నారు. ఆయన అవినీతి అక్రమాలు బయటకు రావడంతో టిడిపి క్యాడర్‌ అయోమయంలో పడిందన్నారు. తమ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులతో పవన్‌ కల్యాణ్‌ ఇంగ్లీషు మాట్లాడాలని ఆయన సవాల్‌ చేశారు. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపు తధ్యమన్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న జగన్మోహన్‌రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపు అందుకుంటారని అన్నారు. మహిళా రిజర్వేషన్‌ ద్వారా మహిళలకు సాధికారిత అందిస్తున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ మాట్లాడుతూ పేదల సాధికారతకు రూ.1800 కోట్లు సంక్షేమం పేరిట అందించామని అన్నారు. ఇంటింటా తిరిగి ప్రజా అవసరాలను తెలుసున్నామన్నారు.