ప్రజాశక్తి-సబ్బవరం
వైసిపి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పిలుపునిచ్చారు. మండలంలోని మొగలిపురం గ్రామంలో మాజీ ఎంపీటీసీ గండి రవికుమార్ ఆధ్వర్యాన ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా బండారు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి ఎపికి ప్రత్యేక హోదాను నీరుగార్చడం, చంద్రన్న పెళ్లి కానుక నిలిపి వేత, ఇసుక అక్రమ అమ్మకాలు, భూకబ్జాలు తదితర అంశాలపై చైతన్యం చేయాలని సూచించారు. మాజీ ఎంపీటీసీ గండి రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో రోడ్లు ఛిద్రమై అనేక మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ తమరాన సన్యాసమ్మ బంగారు నాయుడు, మాజీ జడ్పీటీసీ గేదెల సత్యనారాయణ, టిడిపి మండల అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మి నాయుడు, నాయకులు కోటాన అప్పారావు, గండి దేముడు, పల్లా తాతారావు, కోరాడ శ్రీను, అంగటి నానాజీ పాల్గొన్నారు.
కోటవురట్ల : మండలంలో వెంకటాపురం గ్రామంలో నిర్వహించిన ఇదేం కర్మ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తొలుత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో వైసిపి నిర్వహిస్తున్న బిసి గర్జన కార్యక్రమంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ, ప్రభుత్వ సలహాదారులు, ప్రధాన కార్యదర్శిలందరినీ రెడ్డిలను పెట్టుకుని బిసి గర్జన పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారన్నారు.టిడిపి ప్రభుత్వంలో బీసీలకు కార్పొరేషన్ ద్వారా 50శాతం సబ్సిడీతో రుణాలు అందజేశామన్నారు.వైసీపీ ప్రభుత్వంలో వెనుకబడిన తరగతులతో పాటు రాష్ట్ర ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు జానకి శ్రీను, ఎంపీపీ సకల రమణమ్మ, సీనియర్ నాయకులు, వెచలపు జనార్ధన్, మాజీ సర్పంచ్ కాళ్ళ శ్రీనివాసరావు, టిడిపి మండల యూత్ అధ్యక్షులు తిరుపతిరావు, బికేపల్లి సర్పంచ్ లింగన్న నాయుడు, కొడవటిపూడి ఎంపీటీసీ సభ్యులు సూర్య ప్రకాష్, భాస్కర్‌రావు, టిడిపి వాణిజ్య విభాగపు అధ్యక్షులు సుంకర బాబ్జి పాల్గొన్నారు.
నర్సీపట్నంరూరల్ : పట్టణంలో అయ్యన్న తనయుడు, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం బీసీల అణచి వేతకు పాల్పడుతుందని నినాదాలు చేశారు. అయ్యన్న స్వగృహం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ శివపురం, ఐదు రోడ్ల జంక్షన్ మీదుగా అబీద్ సెంటర్ చేరుకొని అక్కడ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు సాగింది. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు అన్యాయం చేసిందన్నారు. 900 నామినేటెడ్ పోస్టుల్లో 800 పోస్టులు రెడ్డిలకే కేటాయించారన్నారు. చంద్రన్న బీమా, స్టడీ సర్కిళ్లు, పెళ్లికానుక వంటివి రద్దు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జెడ్పీటీసి సుకల రమణమ్మ, మండల టీడీపీ అధ్యక్షులు లాలం శ్రీరం గస్వామి, కౌన్సిలర్లు, మాజీ ఎంపిపిలు, జెడ్పీటీసీలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










