Mar 17,2023 23:37

మాట్లాడుతున్న పరుచూరి భాస్కరరావు

ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్ర బడ్జెట్లో 532 కోట్ల రూపాయలు కేటాయించడం సిగ్టుచేటని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో ఐటీ శాఖకు కేటాయించిన రూ.215 కోట్ల కంటే ప్రభుత్వ ఆర్భాటాలకు అధికంగా ఖర్చు చేయడం చూస్తే రాష్ట్ర అభివృద్ధి కన్నా తమ పార్టీ ఆర్భాటాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. వివిధ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు వాటి చైర్మన్‌లకు జీతాలు, హంగు ఆర్భాటాలకే సరిపోవన్నారు. ఒకపక్క పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూనే పర్యావరణానికి 685 కోట్లు కేటాయించడం చూస్తుంటే ఈ నిధులు దారి మళ్లించేందుకేనని పేర్కొన్నారు. సుమారు 60 వేల కోట్ల రూపాయలు నవరత్నాల పథకాలకు కేటాయించడం, ఆ భారాన్ని తిరిగి ప్రజలే మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు ఏవీ?
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి నామమాత్ర నిధులు కేటాయించడం బాధాకరమని అఖిలభారత బిసి ఫెడరేషన్‌ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు విల్లూరి పైడారావు విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేవలం రూ.10,386 కోట్లు కేటాయించి వెనుకబడిన వర్గాలను ఆదుకుంటున్నట్టు ప్రకటనలు ఇస్తున్నారని విమర్శించారు. బీసీ వర్గాలకు బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రైతులకు, నీటిపారుదల శాఖకు కేటాయించిన నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు చేయకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చిత్తశుద్ధితో తుమ్మపాల చక్కర కర్మాగారాన్ని ఆధునికీకరించి ఈ ప్రాంత రైతాంగ రుణం తీర్చుకోవాలని కోరారు.
బడ్జెట్లో వికలాంగులకు మొండి చెయ్యి
రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులకు మొండి చేయి చూపిందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు పాతరపల్లి వీరు యాదవ్‌ విమర్శించారు. శుక్రవారం వుడ్‌ పేట సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం వికలాంగులకు రూ.3వేలు పింఛను ఇవ్వగా, ఈ నాలుగేళ్లలో వికలాంగుల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించలేదని పేర్కొన్నారు. వికలాంగుల పట్ల వివక్ష చూపిస్తే రానున్న ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో కోరుకొండ నాగరాజు, బాదంపూడి నాగేష్‌, గంజి కనకరాజు, మొల్లి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.