Nov 18,2022 23:56

ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న పివిజి.కుమార్‌, రామానాయుడు

ప్రజాశక్తి-దేవరాపల్లి : వైసిపి చేస్తున్న అరాచకాలను గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి కార్యకర్తా ఎండగట్టాలని టిడిపి మాడుగుల నియోజకవర్గ పరిశీలకులు నొడగల కృష్ణ పిలుపునిచ్చారు. మండలంలోని తిమిరంలో శుక్రవారం టిడిపి మండల అధ్యక్షులు చిటిమిరెడ్డి సూర్యనారాయణ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముందుగా ఎన్టీ రామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ జగన్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి ఇద్దరు గజదొంగలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని ఆరోపించారు. టిడిపి నియోజకవర్గం ఇన్‌ఛార్జి పివిజి.కుమార్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పార్టీని గెలిపించుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ తప్పులు అందరూ చేస్తామని, సర్దుకుపోవాలని, ఎటువంటి గ్రూపులు లేకుండా అందరూ ఒకే తాటిపై నడవాలని సూచించారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ ఆదిరెడ్డి వరలక్ష్మి, టిడిపి నాయకులు చర్కాన సూర్యనారాయణ, సాంబమూర్తి, ఈశ్వరరావు, చల్ల నానాజీ, పోతల పాత్రునాయుడు, గురుపోటు నరసింహమూర్తి, కోమార బాబురావు, బండారు రామారావు ఇతర నాయకులు పాల్గొన్నారు.