ప్రజాశక్తి-పర్చూరు: రాష్ట్రంలో వైసిపి అసమర్థ అరాచక పాలనతో విసిగి వేసారిన వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ఆదివారం పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన పంచాయతీ వార్డు మెంబర్ మస్తాన్‌వలి ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే ఏలూరి తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మినహా రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదన్నారు. వైసిపి అరాచక పాలనతో విసిగివేసారిన కరుడుకట్టిన వైసీపీ నాయకులు సైతం తెలుగుదేశం పార్టీ వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలో గత మూడున్నర ఏళ్లుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అభివద్ధిని బేరీజు వేసుకొని ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విజినరి, అనుభవం దృష్ట్యా రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబుతో సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలంతా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.










