Nov 15,2023 23:36
టిడిపి జనసేన సమన్వయకర్తల సంయుక్త సమావేశ దృశ్యం

ప్రజాశక్తి-బాపట్ల: టిడిపి, జనసేన సంయుక్తంగా పనిచేసి వైసీపీని మట్టి కరిపించి రాష్ట్రంలో టిడిపి బావుటా ఎగురవేసేందుకు టిడిపి, జనసేన కార్యకర్తలు దీక్ష దక్షతలతో వీర సైనికుల్లా పనిచేయాలని టిడిపి ఇన్‌చార్జి వేగేసేన నరేంద్ర వర్మ అన్నారు. స్థానిక ఎమ్మెస్సార్‌ కళ్యాణ మండపంలో టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సంయుక్తంగా నిర్వహించారు. వైసీపీపై సంయుక్తంగా కలిసి పోరాటాన్ని కొనసాగించాలని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని అన్నారు. ఈ నెల 17వరకు భవిష్యత్తు గ్యారెంటీ ఇంటింటి ప్రచారాన్ని టిడిపి-జనసేన నాయకులు సమన్వయంతో నిర్వహించాలని నిర్ణయించారు. బూతుల వారీగా ఓటర్ల జాబితా పరిశీలన చేయాలని కోరారు. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే, ఇంఛార్జ్‌పై ఛార్జ్‌ షీట్‌ తయారు చేయాలని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ పెట్టాలని అన్నారు. నిరుద్యోగం, కరువు పరిస్థితిపై చర్చ చేయనున్నట్లు తెలిపారు. ఇరుపార్టీల సామాజికవర్గాల ఉమ్మడిగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రతి 15రోజులకు ఇరుపార్టీల నాయకులు ఉమ్మడిగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై ఇరు పార్టీ నాయకుల ఉమ్మడి పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో అధ్వానంగా ఉన్న రోడ్ల దుస్థితిపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సలగల రాజశేఖర్‌ బాబు, తాత జయప్రకాష్‌ నారాయణ, చుండూరుపల్లి శివ, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, బాపట్ల జనసేన ఇన్‌ఛార్జి నామన వెంకట శివ నారాయణ, గుంటుపల్లి తులసి కుమారి, మణికంఠ, కత్తి నాగలక్ష్మి, జె విజయ మోహిని పాల్గొన్నారు.