Jul 31,2023 00:46
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వేగేశన నరేంద్రవర్మ

ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం రివర్స్‌ టెండర్ల పేరుతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచి పోయాయని తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం బాధ్యులు వేగేశన నరేంద్రవర్మ విమర్శించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీటి వ్యవసాయం సంక్షోభం దిశగా పయనిస్తోందన్నారు. వైసిపి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, కక్షపూరిత విధానాలతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోయి రైతులకు తీరని నష్టం జరుగుతోందని అన్నారు. చంద్రబాబు పాలనలో ఏడాది కాలంలోనే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకారం అంతంతమాత్రంగా ఉన్నా పట్టుదలతో దాదాపు 70శాతం వరకు పనులు పూర్తి చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో కేవలం 3 శాతం పనులు మాత్రమే చేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై రూ.21 వేల 445 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఖర్చు చేసింది కేవలం 4 వేల 375 కోట్లు మాత్రమే అన్నారు. దీన్నిబట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఏ మేరకు పాటుపడుతుందో విశదమవుతుందన్నారు. సమావేశంలో బాపట్ల పట్టణ పార్టీ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు, బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కామల సాంబశివరావు పాల్గొన్నారు.