Sep 14,2021 06:53

    సెంబ్లీ ఎన్నికలు ఏడాదిలో ఉన్నాయనగా గుజరాత్‌ ముఖ్యమంత్రి విజరు రూపానీ శనివారం ఆకస్మికంగా రాజీనామా చేశారు. బిజెపి అధిష్టానం పంపిన పెద్దలు ఆదివారం అహ్మదాబాద్‌ చేరుకొని తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఎలాంటి పాలనా అనుభవం లేని భూపేంద్ర పటేల్‌ను కొత్త సి.ఎం గా ఎంపిక చేయడం, సోమవారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడం ముందే రాసుకున్న స్క్రిప్టు మాదిరి చకచక జరిగిపోయాయి. రూపానీ మార్పు అధిష్టానం ఆదేశాల మేరకు చోటు చేసుకున్న ఉదంతమనడానికి పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆయనకు తలలో నాలుకలా వ్యవహరించే అమిత్‌షా ఇరువురి స్వంత క్షేత్రం గుజరాత్‌. అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు సంవత్సరం ముందు సరిగ్గా ఇలాగే ఆనందిబెన్‌ను తప్పించి రూపానీని ఎక్కించారు. ఇప్పుడూ మోడీ-షా ద్వయం ముఖ్యమంత్రి మార్పు అనే తంత్రం ప్రయోగించి 2022 ఎన్నికల్లో గట్టెక్కాలని ప్లాన్‌ వేసినట్లున్నారు. వాస్తవానికి రూపానీ పాలనపై ప్రజల్లోనే కాదు స్వపక్షంలోనూ ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కోవిడ్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ విషయంలో సర్కారును హైకోర్టు అభిశంసించాల్సి వచ్చింది. మరో వైపు గుజరాత్‌లో రైతుల ఆత్మహత్యలకు అంతు లేకుండా ఉంది. రాష్ట్రాన్ని అదానీ, అంబానీ ఇష్టారీతిన దోచుకుంటున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రగులుతున్నారు. డీజిల్‌, పెట్రోలు, నిత్యావసరాల ధరల కాక జనం నెత్తికంటింది. అన్నింటికీ మించి రాష్ట్రంలోని ఆధిపత్య కులం నుండి ఇంటా బయటా అసంతృప్తులు బయలు దేరాయి. ఈ సమస్యలన్నింటికీ ఒకే మందు సి.ఎం మార్పు అని, దాంతో ప్రజల దృష్టిని కొంతైనా సైడ్‌ చేయొచ్చన్నది బిజెపి అధిష్టానం భావనగా కనిపిస్తోంది. అందుకే సి.ఎం మార్పు డ్రామా.
     కాంగ్రెస్‌ పార్టీ ఇష్టానుసారం ముఖ్యమంత్రులను మారుస్తుందని, సీల్డ్‌ కవర్‌లో పేర్లు పంపుతుందని విమర్శలు చేసిన బిజెపి, సి.ఎం లను మార్చడంలో కాంగ్రెస్‌ తలలో నుండి లేచి వచ్చినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఆర్నెల్లలో మూడు రాష్ట్రాలకు నలుగురు సి.ఎం లను అవలీలగా మార్చేసింది. కర్ణాటకలో ఎడ్యూరప్ప చేత రాజీనామా చేయించి బసవరాజు బొమ్మరుని ప్రతిష్టించింది. ఎడ్యూరప్ప కుమారుడిపై అవినీతి ఆరోపణలతోపాటు స్వంత పార్టీలో కుమ్ములాటలే మార్పునకు హేతువని వల్లిస్తున్నా అధిష్టానానికి ఎడ్యూరప్ప నచ్చకపోవడమే అసలు సిసలైన కారణం. ఉత్తరాఖండ్‌లో ఇద్దరు సి.ఎం లు మారారు. త్రివేంద్ర సింగ్‌ రావత్‌ పోయి తీరథ్‌ సింగ్‌ రావత్‌ వచ్చారు. ఆయన వెడలి పుష్కర్‌సింగ్‌ ధామీ ఏతెంచారు. అంతర్గత గ్రూపుల కొట్లాటల్లోనే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్‌ సి.ఎం యోగి ఆదిత్యనాథ్‌ తొలగింపునకు తీవ్రంగానే కసరత్తు చేశారు. కరోనా నియంత్రణలో వైఫల్యంతో పాటు పలు ఆరోపణలను యోగి మూటగట్టుకున్నారు. ఆయన్ని ఇంటికి పంపడానికి ఎందుకో అధిష్టానం సాహసం చేయలేక పోయింది. 'నాగ్‌పూర్‌' ఒత్తిడితోనే వెనకడుగు వేసినట్లున్నారు. ఎన్నికల ముంగిట జనాభా నియంత్రణ వంటి వివాదాస్పద చట్టాలను తెచ్చి తమ 'గురు' ఆదేశాలను యోగి పక్కాగా పాటిస్తున్నారు.
     ప్రభుత్వ విధానాలపై, పాలనా వైఫల్యాలపై ప్రజల్లో నిరసనలు పెల్లుబికిన ప్రతిసారీ ఒకరిద్దరిపై చర్యల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించడం బిజెపి కి వెన్నతో పెట్టిన విద్య. మొన్నటి కేంద్ర మంత్రివర్గ విస్తరణలో 12 మంది పాత మంత్రుల చేత రాజీనామాలు చేయించి నాటకం ఆడారు. ఐ.టి రూల్స్‌లో వివాదాస్పదుడైన రవి శంకర్‌ ప్రసాద్‌, విద్యా వ్యవస్థలో విమర్శలకు ప్రకాశ్‌ జవదేకర్‌, కరోనా నియంత్రణకు బాధ్యుడిని చేస్తూ హర్షవర్ధన్‌ను తప్పించారు. నిజానికి మోడీ ఆదేశం లేకుండా ప్రభుత్వంలో చీమ కూడా కదలదన్న రహస్యం జగద్విదితం. అలాంటిది సర్కారీ ఘోరాలపై కొందరిని పావులుగా వాడుకోవడం బిజెపి ఆడుతున్న రాజకీయ క్రీడలో ఒక భాగం. ముఖ్యమంత్రులను, కొందరు నాయకులను మార్చడం ద్వారానే ఎన్నికల్లో నెగ్గాలనుకునే పాచిక ఎల్లకాలం పారదు. వాస్తవాలను ప్రజలు తప్పక గుర్తించి తగిన సమాధానం చెబుతారు.