
ప్రచారార్భాట కార్యక్రమాలకు, ప్రధాని పర్యటనలను అట్టహాసంగా ప్రచారం చేసుకోడానికి, ఉత్సవాలు, పండుగలు జరుపుకోడానికి ప్రభుత్వ ఖజానాలో అధిక భాగాన్ని ఖర్చు చేశారు. ప్రజలు అత్యంత కష్టకాలంలో ఉంటే, వారి ఉపాధి హామీ వేతనాలను సైతం బిజెపి నేతలు విడిచి పెట్టలేదు. ఇల్లు గడవడానికి కన్నబిడ్డల్ని సైతం అమ్ముకోడానికి తల్లిదండ్రులు సిద్ధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. తాగునీరు కావాలనో, విద్యుత్ సరఫరా కావాలనో, రోడ్లు మరమ్మతులు చేయాలనో, ఏదో ఒక డిమాండ్ తో ప్రజానీకం రోడ్డెక్కని రోజు లేదు. వామపక్ష ప్రభుత్వం పాలించిన మొత్తం కాలంలో తీసుకున్న మార్కెట్ రుణం కన్నా ఈ నాలుగేళ్ళ కాలంలోనే రెట్టింపు మార్కెట్ రుణాన్ని బిజెపి ప్రభుత్వం చేసింది.
ఉన్నట్టుండి మే 14న త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా సమర్పించారు. అదే రోజున కేంద్ర బిజెపి నేతల బృందం హుటాహుటిన అగర్తల చేరింది. తమ పార్టీ శాసన సభ్యులు కొత్త నాయకుడిని ఎన్నుకోడానికి సమావేశం నిర్వహించింది. కొంత గందరగోళం జరిగాక ఆ సమావేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఉన్న మాణిక్ సాహా ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నదని, ఆ మర్నాడు అతను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడని మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాని రాష్ట్రానికి వచ్చిన ప్రతీసారీ ''అంకిత భావంతో, శక్తివంతంగా, అలుపెరుగకుండా కష్టపడే'' ముఖ్యమంత్రులలో ఒకరుగా విప్లవ్ దేవ్ ను ఇన్నాళ్ళూ ఆకాశానికెత్తేస్తూ వచ్చారు. ''అభివృద్ధిలో ముఖ్యమైన మైలురాయిని దాటగలిగాడ''ని, ''డబుల్ ఇంజన్'' ప్రభుత్వం (కేంద్రం లోను, రాష్ట్రం లోను ఒకే పార్టీ ప్రభుత్వం ఉండడం) వల్లనే ఇది సాధ్యపడిందని చెప్పుకుంటూ వచ్చారు. మరి అటువంటి సమర్ధుడైన(?) ముఖ్యమంత్రిని మార్చాలని ఎందుకు నిర్ణయించారో, అందునా, ఇంకా కేవలం పది నెలలలోపే ఎన్నికలు జరగబోతున్న సమయంలో ఎందువలన ఈ మార్పు జరిగిందో ఆ నేతలెవరూ వివరించలేదు. కాని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని అభిలషించే లౌకిక ప్రజాతంత్ర శక్తులకు, ప్రజానీకానికి మాత్రం ఈ మార్పు ఎందుకు జరిగిందో స్పష్టంగానే బోధపడింది.
తన 50 మాసాల పరిపాలనలో విప్లవ్ కుమార్ దేవ్ ఒక నిరంకుశ, ఫాసిస్టు పాలనను కొనసాగించి అన్ని తరగతుల ప్రజల ఆగ్రహానికీ గురయ్యారు. అతని హయాంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతర వేశారు. ఎన్నికలను పూర్తి ప్రహసనంగా దిగజార్చారు. రాష్ట్రంలో హోం శాఖామంత్రిగా కూడా వ్యవహరించిన విప్లవ్ దేవ్ మోటర్ సైకిల్ గ్యాంగ్ లను ప్రోత్సహించి ప్రతిపక్షాలకు చెందిన నేతలపై, కార్యకర్తలపై, మద్దతుదారులపై దాడులను జరిపించారు. అతడి అండ చూసుకుని రెచ్చిపోయిన ఆ రౌడీ గ్యాంగ్ లు ప్రతిపక్షాలకు చెందిన నేతల ఇళ్ళను, ఆఫీసులను లూటీ చేయడం, తగులబెట్టడం, విధ్వంసం చేయడం వంటివి చేశారు. ముఖ్యంగా సిపిఐ(ఎం) పార్టీ ని లక్ష్యంగా వాళ్ళు ఎంచుకున్నారు. ప్రతిపక్షాలను కట్టడి చేయడమే లక్ష్యంగా వ్యవహరించారు. అసంఖ్యాకంగా జరిగిన ఈ దుర్మార్గపు దాడుల సందర్భంగా దోషులను అరెస్టు చేయడం గాని, కేసులు నమోదు చేయడం గాని ఎక్కడా జరగలేదు. ''ఇది బిజెపి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పడిపోతే అప్పుడు ఫిర్యాదులు తీసుకుని రండి'' అని చెప్పేటందుకు పోలీసులు బరితెగించారంటే నేరస్తులకు విప్లవ్ కుమార్ దేవ్ ఇచ్చిన దన్ను ఎటువంటిదో బోధపడుతుంది.
ఈ రౌడీ గ్యాంగ్ లు ప్రతిపక్షాలకు చెందిన వారినే గాక, ప్రభుత్వ అధికారులని, మేథావులని, వైద్యులని, నర్సులని, లాయర్లని, మీడియా ప్రతినిధులని, ఆఖరికి పోలీసుల్లోని నిజాయితీ పరుల్ని సైతం వదిలిపెట్టలేదు. ఒక సిండికేటు రాజ్యంగా ఇన్నాళ్ళూ నడిచింది.
2018 అసెంబ్లీ ఎన్నికలకి ముందు ఏకంగా 299 హామీలతో ఒక ''విజన్ డాక్యుమెంట్'' ను బిజెపి విడుదల చేసింది. తద్వారా ప్రజలలో భ్రమలు సృష్టించింది. గత నాలుగేళ్ళ పాలనలో ఆ హామీలన్నీ వొట్టి బూటకమేనని తేలిపోయింది. నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం ప్రతీ ప్రభుత్వ శాఖలోకీ చొరబడ్డాయి. వందల కోట్ల మేర ఉపాధి హామీ నిధులను ఏవిధంగా స్వాహా చేస్తున్నారో ప్రతీరోజూ వార్తా పత్రికల్లో కథనాలు వస్తూనే వున్నాయి. ప్రభుత్వ గృహాలను మంజూరు చేయడానికి ఎంతెంత మోతాదుల్లో లంచాలు వసూలు చేస్తున్నారో ఆ కథనాలూ వచ్చాయి. ఆ కథనాలు వాస్తవం కావని ఏ ఒక్క సందర్భంలోనూ ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారంలో బిజెపి నేతల పలువురు భాగస్వాములుగా ఉన్నారు. ''మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా'' తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఇచ్చిన నినాదం అపహాస్యం పాలైంది.
కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు అడుగంటాయి. కనీసంగా అవసరమైన ఔషధాలు గాని, వైద్య పరికరాలు గాని, వైద్య సిబ్బంది గాని లేకపోవడమే కారణం. రాష్ట్రంలోని ప్రధాన ఆస్పత్రి గా ఉన్న జిబిపి హాస్పిటల్‌లో సైతం చాలా కాలం వరకూ ఆక్సిజన్ సరఫరా కూడా సక్రమంగా జరగలేదు. దాని కారణంగా అనేకమంది రోగులు ప్రాణాలను కోల్పోయారు. ఆరోగ్య శాఖకు కూడా మంత్రిగా వ్యవహరించిన విప్లవ్ కుమార్ దేవ్ ప్రభుత్వ వైద్య వ్యవస్థను సక్రమంగా నడిపించడానికి కావలసిన ఏ ఒక్క చర్యనూ తీసుకోలేదు.
ప్రచారార్భాట కార్యక్రమాలకు, ప్రధాని పర్యటనలను అట్టహాసంగా ప్రచారం చేసుకోడానికి, ఉత్సవాలు, పండుగలు జరుపుకోడానికి ప్రభుత్వ ఖజానాలో అధిక భాగాన్ని ఖర్చు చేశారు. ప్రజలు అత్యంత కష్టకాలంలో ఉంటే, వారి ఉపాధి హామీ వేతనాలను సైతం బిజెపి నేతలు విడిచి పెట్టలేదు. ఇల్లు గడవడానికి కన్నబిడ్డల్ని సైతం అమ్ముకోడానికి తల్లిదండ్రులు సిద్ధపడిన సందర్భాలెన్నో ఉన్నాయి. తాగునీరు కావాలనో, విద్యుత్ సరఫరా కావాలనో, రోడ్లు మరమ్మతులు చేయాలనో, ఏదో ఒక డిమాండ్ తో ప్రజానీకం రోడ్డెక్కని రోజు లేదు. వామపక్ష ప్రభుత్వం పాలించిన మొత్తం కాలంలో తీసుకున్న మార్కెట్ రుణం కన్నా ఈ నాలుగేళ్ళ కాలంలోనే రెట్టింపు మార్కెట్ రుణాన్ని బిజెపి ప్రభుత్వం చేసింది.
ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎత్తి చూపుతూ తక్షణ ప్రజా సమస్యల పరిష్కారాన్ని చేపట్టాలని ప్రభుత్వం మీద వామపక్షాలు వత్తిడి చేస్తున్నాయి. స్థానిక సమస్యల పైన కూడా పరిష్కారాన్ని కోరుతూ ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాయి. ప్రజల డిమాండ్లను పరిశీలించి తగు చర్యలు తీసుకోవలసినది పోయి ఆందోళనకారులపై లాఠీలను, నీటి ఫిరంగులను ప్రయోగించింది బిజెపి ప్రభుత్వం. పైగా పలువురు ప్రజా నేతలపై అక్రమ కేసులను బనాయించింది. ప్రజాతంత్ర చైతన్యం గల త్రిపుర ప్రజానీకం ఈ దమనకాండను సహించడం లేదు.
అధికారులలో నిజాయితీ గలవారు, చట్టబద్ధంగా వ్యవహరించేవారు ఈ ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా అడుగులకు మడుగులు వత్తలేకపోతున్నారు. చివరికి క్యాబినెట్ మంత్రులలో సైతం అపనమ్మకం నెలకొంది. పెరుగుతున్న ప్రజాగ్రహానికి తలొగ్గి ఇప్పటికి ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసేశారు. ముఖ్యమంత్రి పదే పదే చేసే అనుచిత వ్యాఖ్యల పట్ల, నిరంకుశ ధోరణి పట్ల వ్యతిరేకత తీవ్రమౌతోంది. చివరికి కేంద్ర నాయకత్వానికే ముఖ్యమంత్రి వైఖరి తలనొప్పిగా మారింది. ప్రభుత్వ ప్రతిష్టనే దిగజార్చింది.
ముఖ్యమంత్రిని ఇలా మార్చడం ప్రభుత్వం యొక్క, పార్టీ యొక్క బలహీనతనే సూచిస్తున్నదని సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకత్వం తన ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభుత్వం అన్ని రంగాలలోనూ వైఫల్యం చెందిందని, అందకే ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించింది. ఈ సమయంలో ముఖ్యమంత్రిని మార్చడం కేవలం ప్రజల దృష్టిని మళ్ళించడానికేనని...ఈ చర్య ద్వారా బిజెపి... ప్రజాగ్రహం నుండి, వ్యతిరేకత నుండి తప్పించుకోలేదని స్పష్టం చేసింది. ప్రజలు తమ భవిష్యత్తు ఏమిటో తామే నిర్ణయించుకుంటారని ప్రకటించింది.
కొత్త ముఖ్యమంత్రి పాలన ఏ విధంగా ఉండబో తుందన్నది ఇప్పుడే చెప్పడం సాధ్యపడదు. కాని, వృత్తి రీత్యా ఒక వైద్యుడై ఉండి కూడా, ఇంతకాలమూ ఈ రాష్ట్రంలో జరిగిన రాక్షస కాండనంతటినీ ఆయన మౌనంగా చూస్తూ ఉండిపోయారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉంటూ కూడా ఏ విధంగానూ కలగజేసుకోలేకపోయారు. తన పార్టీలో ఉన్న అరాచక శక్తుల ఆగడాలను అదుపు చేయడానికి ఏ విధమైన చర్యలనూ తీసుకోలేకపోయారు. ప్రభుత్వంలో అన్ని చోట్లా సాగుతున్న అవినీతి పట్ల కూడా ఆయన నిశ్చేష్టుడిగానే ఉన్నారు.
రాష్ట్రంలో సాగుతున్న అరాచక, ఫాసిస్టు, అవినీతిమయ పాలన నేపథ్యంలో, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న పరిస్థితిలో, సామాన్య ప్రజల జీవన స్థితిగతులు దిగజారుతున్నా పట్టించుకోని పరిస్థితిలో, అన్ని రంగాలలో పాలన ఘోరంగా విఫలమైన పరిస్థితిలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవాన్ని బహిష్కరించాలని సిపిఐ(ఎం) నిర్ణయించింది.
కేంద్రం లోను, ఇటు రాష్ట్రం లోను బిజెపి పాలన కొనసాగుతూన్నంత కాలమూ ప్రజల పరిస్థితులు ఈ విధంగానే దిగజారుతూ వుంటాయని, ముఖ్యమంత్రిని మార్చినంత మాత్రాన తేడా ఏమీ ఉండబోదని సిపిఐ(ఎం) ప్రకటించింది. ఈ నిరంకుశ, ప్రజావ్యతిరేక పాలనను తుదముట్టించేవరకూ ప్రజలు ఊరుకోరని, తమ వంతు కీలక పాత్రను పోషించడం ఖాయమని ప్రకటించింది.
హరిపాద దాస్