ప్రజాశక్తి-ఎఎన్‌యు : సమాజ వికాసంలో సైకాలజిస్టుల పాత్ర అమోఘమని, యువత మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ పి.రాజశేఖర్ అన్నారు. స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సైకాలజిస్టులకు రెండు రోజుల వర్క్‌షాప్ వర్సిటీలో శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజు ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ బాధితుల యొక్క సమస్యలను అనేక కోణాల్లో విశ్లేషించి, వారి సమస్యలకు మూలకారణాన్ని గుర్తించండంలో, వారిని సరైన వారిగా తీర్చిదిద్దడంలో సైకాలజిస్టుల కృషి అభినందనీయమన్నారు. యువతకు మానసిక ధృఢత్వం కావాలని, ప్రతీ చిన్న సమస్యకూ కుంగిపోకూడదని చెప్పారు. జీవితంలో ప్రతిఒక్కరికీ విజయాలు, వైఫల్యాలు సర్వసాధారణమని, అందుకోసం ప్రాణాలను బలిపెట్టడం సరికాదని అన్నారు. వైఫల్యాలే విజయ సోపానాలు కావాలని ఆకాంక్షించారు. 'యువతకు మానసిక దృఢత్వం అందించేందుకు స్పందన ఈదా ఫౌండేషన్ చైర్మన్ ఇ.శామ్యూల్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. శామ్యూల్‌రెడ్డి మాట్లాడుతూ తమ కుటుంబంలో జరిగిన బాధాకర సంఘటన మరే కుటుంబంలోనూ జరగకూడదనే సంకల్పముతో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటుగా మరెన్నో ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కష్టాలు భయపెట్టడానికి రావనీ... ఎలా బతకాలో నేర్పడానికి వస్తాయని అన్నారు. స్పందన ఈద ఫౌండేషన్ గతంలో వర్సిటీతో ఎంఒయు కుదుర్చుకుని, సమన్వయంతో మరెన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోందని తెలిపారు. వర్క్‌షాప్‌లో ఎస్‌ఇఐఎఫ్ ఉభయ తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులు 150 మందికి పైగా సైకాలజిస్టులు హాజరయ్యారు. ఈమో కేర్ మేనేజింగ్ డైరెక్టర్ సీతాలక్ష్మీ శివకుమార్, సీబీటీ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈదా అంజిరెడ్డి పర్యవేక్షించారు.
మాట్లాడుతున్న వీసీ పి.రాజశేఖర్










