Nov 07,2022 23:53

సదస్సులో ప్రసంగిస్తున్న వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి

ప్రజాశక్తి-విశాఖపట్నం : 'అసాధ్యాలను సుసాధ్యం చేసే తరం మీది. వైఫల్యాలను చూసి భయపడకండి. మీ ప్రయత్నాలను మానకండి' అని ఎయు విసి ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి విద్యార్థులనుద్దేశించి అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ (ఏయూ సిబ్‌) నూతన బ్యాచ్‌ తరగతుల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తును నిర్మించుకునే విలువైన కాలంలో ఈ ఐదేళ్లు నిలుస్తున్నాయనే విషయం మరువరాదన్నారు. విశిష్ట అతిథి, ఐఐఎం విశాఖపట్నం సంచాలకులు ఆచార్య ఎం.చందశ్రేఖర్‌ మాట్లాడుతూ, విలువైన కాలాన్ని విద్యపై వెచ్చిస్తే మెరుగైన భవిష్యత్తు సాధించడం వీలవుతుందన్నారు. సిస్టమ్‌ స్కిల్స్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌, సోషల్‌ స్కిల్స్‌ను విద్యార్థులు అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని వివరించారు.
నేటివ్‌ అరకు కాఫీ వ్యవస్థాపకులు రామ్‌కుమార్‌వర్మ మాట్లాడుతూ, ఉద్యోగి నుంచి వ్యాపారవేత్తగా ఎదిగిన ప్రస్థానం వివరించారు. ఈ ప్రయాణంలో తాను విఫలమైన సందర్భాలు, విజయాలు సాధించిన విధానం విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎయు రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌, సిబ్‌ ఎఒ డాక్టర్‌ సారాబంది, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ దేశాల విద్యార్థుల సాంసృతిక ప్రదర్శనలు అలరించాయి.