
గతంలో ఎన్నడూ లేని విధంగా భారత వికలాంగ క్రీడాకారులు పారాలింపిక్స్‌లో విశ్వరూపం ప్రదర్శించారు. ఎవరూ ఊహించని విధంగా భారత్‌కు పసిడి కాంతులు కురిపించారు. పతకాల పంట పండిస్తూ దేశ ఘనకీర్తిని విశ్వవ్యాప్తం చేశారు. ఒక విధంగా టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. భారత్‌కు స్వర్ణ సంబరాన్ని కానుకగా ఇచ్చారు. తొలిరోజు నుంచీ ముగింపు వరకూ తగ్గేదేలే అంటూ.. మన క్రీడాకారులు అద్వితీయమైన క్రీడా ప్రతిభతో రాణించారు. వికలాంగుల విశ్వక్రీడల్లో భారత్‌కు స్వర్ణాధ్యాయాన్ని లిఖించారు. ఇదెంతో అద్భుతం.. అపూర్వం.. చరిత్రాత్మకం కూడా. అయితే, ఈ విజయాల వెనుక ఎంతో కష్టం, ఎన్నెన్నో అవమానాలు దాగి ఉన్నాయి. ప్రోత్సాహం కరువైన చోట పసిడి కాంతులు పండించడం వెనుక అకుంఠిత దీక్ష, పట్టుదలలు దాగి ఉన్నాయి. పట్టు సడలని ఆత్మ విశ్వాసం అంతర్లీనమై ఉంది. ప్రభుత్వాల నుంచి సరైన ఆదరణ గనుక లభించి ఉంటే పారాలింపిక్స్‌లో మరిన్ని పతకాలు దక్కి ఉండేవి. మన క్రీడాకారులు గెలిచిన తరువాత ఇదంతా 'మా గొప్పే' అని మోడీ సర్కారు చెబుతున్నా వాస్తవం వేరుగా ఉంది. స్వశక్తితోనూ.. ఒక విధంగా చెప్పాలంటే ఏకలవ్య శిక్షణతోనూ.. మనవాళ్లు పారా క్రీడల్లో రాణించారంటే అతిశయోక్తి కాదు. మన దేశంలో వికలాంగ క్రీడల తీరు తెన్నులు? ప్రభుత్వాల ప్రోత్సాహం? వివక్ష రూపాలు? భుజం తట్టేవారు లేకున్నా, వికలాంగులు విజేతలుగా ఎలా నిలుస్తున్నారు? అన్న విషయాలను స్పృశిస్తూ.. కొత్త కోణాలను ఆవిష్కరించేదే ఈ కథనం.
పారాలింపిక్స్ క్రీడలు వికలాంగుల్లో ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడ్డాయి. తామూ సకలాంగులతో సమానమనే భావనను కలిగించాయి. నిండైన ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి. అభివృద్ధి చెందిన దేశాలుగా పిలవబడుతున్న అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో వికలాంగులను శక్తి వనరులుగా చూస్తున్నారు. మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నారు. వారి సంక్షేమానికి ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చిస్తున్నారు. పారా అథ్లెట్లుకు ఆయా దేశాల్లో ఎంతో ప్రోత్సాహం దక్కుతోంది. అందుకే ఇప్పటివరకూ పారాలింపిక్స్‌లో యుఎస్‌ఎ 2279 పతకాలు, బ్రిటన్ 1913 పతకాలు సాధించి, అగ్ర స్థానాల్లో ఉన్నాయి. టోక్యో పారాలింపిక్స్‌లో చైనా 207 పతకాలు సాధించి, తొలి స్థానంలో నిలిచింది. ఇక మన దేశం విషయానికొస్తే ఇప్పటివరకూ 31 పతకాలు దక్కాయి. వీటిలో టోక్యో పారాలింపిక్స్‌లోనే 19 దక్కడం గమనార్హం.
గ్రామీణులు ఎరుగని విశ్వ వేదిక
ఐదు దశాబ్దాలుగా పారాలింపిక్స్‌లో భారత్ క్రీడాకారులు పాల్గొంటున్నారు. అయితే, ఇప్పటికీ వికలాంగులకు ప్రత్యేక విశ్వ క్రీడా వేదిక ఉందనే విషయం చాలా మందికి తెలియదు. పారా స్పోర్ట్స్ పదాన్ని గ్రామీణ ప్రాంతంలోని వికలాంగులు ఇప్పటికీ ఎరుగరు. క్రీడల పట్ల వారికి అవగాహన కల్పించే పనిని ప్రభుత్వాలు ఏనాడూ చేపట్టలేదు. ఇది ఓ రకంగా వివక్షే. వికలాంగ సంఘాల పోరాటాలు, ఐక్యరాజ్య సమితి సూచనలు మేరకు 2007 నుంచి కొన్ని మార్పులు సంతరించుకున్నాయి. ఆ ఫలితమే నేడు పెరిగిన పతకాలు.
సొంత నిధులతోనే శిక్షణ..!
వాస్తవానికి వికలాంగుల చట్టం - 2016 సెక్షన్ 30 వైకల్యాలున్న వ్యక్తులకు క్రీడల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెబుతోంది. వారి క్రీడా హక్కులను బలపరుస్తోంది. కానీ ఆ పని జరగడం లేదు. పెక్కు రాష్ట్రాల్లో వికలాంగులకు ప్రత్యేక క్రీడా సదుపాయాలు లేవు. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ అకాడమీలు లేనే లేవు. ప్రభుత్వాలు తగిన నిధులు కేటాయించకపోవడంతో వికలాంగ క్రీడాకారులే తమ సొంత డబ్బులు వెచ్చించి, శిక్షణ పొందుతున్న ఉదంతాలు అనేకం. వీల్ ఛైర్ బ్యాడ్మింటన్ క్రీడనే తీసుకుంటే.. ఒక అధునాతన వీల్‌ఛైర్ రూ.5 లక్షలు ఉంటుంది. అంత మొత్తం వెచ్చించి, కొనుక్కోలేని స్థితిలో మన దేశీయ క్రీడాకారులు రూ.40 వేలు విలువజేసే వీల్‌ఛైర్‌తోనే సాధన చేస్తున్నారు. కొంతమంది వాటితోనే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నారు. 'అమెరికా, బ్రిటన్ క్రీడాకారులు లక్షల రూపాయల వీల్‌ఛైర్లతో కదన రంగంలోకి దిగుతుంటే మనవారు నాణ్యతలేని వాటితో బరిలో దిగితే పతకాలు ఎలా వస్తాయి?' అని వీల్‌ఛైర్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు వాపోతున్నారు.

మరుగున పడుతున్న ప్రతిభ...!
'నెలకు రెండు షటిల్ బ్యాట్లు అవసరం. ఒక్కోదాని విలువ రూ.ఆరు వేలు. 12 షటిల్ కాక్స్ ఉండే బ్యారెల్ సాధనకు మూడు రోజులే వస్తుంది. ఒక్కో బ్యారెల్ ధర కనీసంగా 1100 ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.11 వేలు ఖర్చవుతుంది. శిక్షణ కోసం అకాడమీకి వెళితే నిర్వాహకులు నెలకు రూ.15 వేలు తీసుకుంటున్నారు. క్రీడాకారునికి అవసరమయ్యే పౌష్టికాహారం కోసం నెలకు రూ.10వేలు వెచ్చించాల్సి వస్తోంది. ఈ లెక్కన ఒక క్రీడాకారుడు నెలకే రూ.42 వేలును భరించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయమూ అందడం లేదు. అందుకే చాలా మంది పారా స్పోర్ట్స్‌కు దూరంగా ఉంటున్నారు' అని కర్నూలు జిల్లా గూడూరు మండలం, మునగాల గ్రామానికి చెందిన అంతర్జాతీయ వీల్‌ఛైర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు బోయ రామాంజనేయులు ఆవేదన చెందుతున్నారు. ఆయన జావెలిన్ త్రోలో 2004 నుంచి 2009 వరకూ విశేష ప్రతిభ కనబరిచారు. జాతీయ స్థాయిలో ఎనిమిది పతకాలు సాధించారు. 2009 నుంచి వీల్‌ఛైర్ బ్యాడ్మింటన్‌వైపు మరలి ఈ క్రీడలోనూ రాణించారు. ఇప్పటివరకూ మూడు అంతర్జాతీయ, నాలుగు జాతీయ స్థాయి పతకాలు సాధించారు. ఇంతగా క్రీడల్లో రాణించిన ఆయన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నేడు జిరాక్స్ సెంటర్ పెట్టుకుని బతుకీడిస్తున్నాడు. ఇలాంటి రామాంజనేయులు దేశంలో కోకొల్లలు. అంతెందుకు, టోక్యోలో ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించి రికార్డు నెలకొల్పిన షూటర్ సింగ్ రాజ్ అథాన కలను నిజం చేయడానికి అతని భార్య నగలను అమ్మకానికి పెట్టింది. డిస్కస్ త్రో ఎఫ్ 56 విభాగంలో రజతం సాధించిన యోగేశ్ కథునియాకు కోచ్ లేడు. ఇవి చాలు.. మన ప్రభుత్వాలు వికలాంగ క్రీడాకారుల పట్ల ఎంతటి వివక్షతను చూపుతున్నాయో అర్థం చేసుకోడానికి.
అడుగడుగునా అవమానమే..
మోడీ సర్కారు హయాంలో 2015లో వికలాంగ అథ్లెట్లు చైనీస్ తైపీ వేదికగా జరిగే ఆసియా, పసిఫిక్ బధిరుల క్రీడల్లో పాల్గొనేందుకు బయలుదేరగా వారికి గొప్ప అవమానమే ఎదురైంది. సాంకేతిక సమస్యలతో వీసా జారీ ఆలస్యమవడంతో రోడ్డుపైనే నిద్రించాల్సిన పరిస్థితి తలెత్తింది. వీరి బాగోగులు చూసుకోవాల్సిన అఖిల భారత బధిరుల క్రీడా మండలి నిర్లక్ష్యంగా వ్యవహరించి వసతి కూడా ఏర్పాటు చేయకపోవడంతో క్రీడాకారులు ఎంతగానో ఇబ్బందిపడ్డారు. అదే ఏడాది ఘజియాబాద్ వద్ద 15వ జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్‌కు హాజరైన వారికి ప్రాథమిక సదుపాయాలు కూడా కల్పించలేదు. మహిళా అథ్లెట్లు స్నానం చేసేందుకు ఇబ్బంది పడ్డారంటే ఏర్పాట్లు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవొచ్చు. అంతెందుకు 2021లో ఇవే క్రీడలు చెన్నరులో జరగాల్సి ఉండగా నాలుగు రోజుల వ్యవధిలోనే బెంగళూరుకు వేదికను మార్చారు. తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో మొబైల్ టార్చ్‌ల వెలుగుల్లోనే కొన్ని క్రీడలు సాగాయి.
మరోపక్క టోక్యోలో బంగారు పతకం గెలిచిన షూటర్ అవనీ లేఖరా, జావెలిన్ త్రోలో రజతం సాధించి దేవేంద్ర జఝారియా, కాంస్య పతక విజేత సుందర్ సింగ్ గుర్జార్‌లకు కొన్ని నెలల పాటు జీతాలు నిలిపివేశారు. అయినప్పటికీ వెరవకుండా కఠోర సాధన చేసి విజయ ఢంకా మోగించారు. ప్రభుత్వాలు వికలాంగ క్రీడాకారుల పట్ల ఎంతటి నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయో తెలియజెప్పడానికి పై సంఘటనలే ఉదాహరణలు.
సమగ్ర క్రీడా విధానం కరువు
పారా క్రీడా విధానానికి దేశంలో సరైనా ప్రణాళిక లేదు. మండల, జిల్లా, రాష్ట్ర, జోనల్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో క్రీడలు జరిగితే మంచి క్రీడాకారులు పుట్టుకొస్తారు. కానీ అలా జరగడం లేదు. భారత్ పారాలింపిక్ కమిటీ, ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ది డెఫ్ ఉన్నా వాటి పనితీరు సరిగా లేదు. వికలాంగ క్రీడలపై అవగాహన లేనివారు, ప్రభుత్వ అనుకూలురు సెలక్షన్ కమిటీల్లో ఉండటం వల్ల పారదర్శకత లోపిస్తోంది. రాజకీయ లాబీయింగ్ దేశంలో అసలైన ప్రతిభకు ప్రతిబంధకంగా మారుతోంది. మరోపక్క బడ్జెట్‌లో క్రీడలకు తగిన నిధుల కేటాయింపు ఉండటంలేదు. టోక్యోలో భారత క్రీడాకారుల విజయాలను చూసైనా పాలకులు కళ్లు తెరిచి సరైన సదుపాయాలు కల్పిస్తే 2024లో పారిస్‌లో జరిగే విశ్వ క్రీడల్లో మరిన్ని పతకాలు రావడం ఖాయం.
సౌకర్యాలు లేకున్నా గెలిచారు..

సాధారణ అథ్లెట్లతో పోలిస్తే పారా అథ్లెట్లపై మన ప్రభుత్వాలు చూపే శ్రద్ధ తక్కువ. శిక్షణ వసతులూ అంతంతమాత్రమే. కార్పొరేట్ సంస్థల ప్రోత్సాహమూ కరువే. అయినప్పటికీ స్వశక్తితో భారత్ పారాలింపియన్లు అడ్డంకులను అధిగమించారు. టోక్యోలో పతకాల పంట పండించి ఎందరికో ప్రేరణగా నిలిచారు. 1968 నుంచి పారాలింపిక్స్‌లో తలపడుతున్న భారత్ టోక్యో క్రీడల్లో మాత్రం 19 పతకాలతో చరిత్ర సృష్టించింది. ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలతో పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. 54 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన మన జట్టులో 17 మంది పతకాలు గెలుచుకోవడం ఈసారి క్రీడల్లో విశేషం. రియో గేమ్స్‌లో సాధించిన 12 పతకాలే భారత్‌కు ఇప్పటి వరకూ అత్యధికం.
పతక ధారలు వీరే..

ఈ విశ్వ క్రీడల్లో అవనీ లేఖరా (షూటింగ్), మనీశ్ నర్వాల్ (షూటింగ్), సుమిత్ అంటిల్ (జావెలిన్ త్రో), ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్), కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్) స్వర్ణ పతకాలు సాధించారు. భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), యోగేశ్ కథునియా (డిస్కస్ త్రో), జఝారియా (జావెలిన్ త్రో), నిషద్ కుమార్ (హైజంప్), మరియప్పన్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), సింగ్‌రాజ్ అధాన (షూటింగ్), సుహాస్ యతిరాజ్ (బ్యాడ్మింటన్) రజత పతకాలు, సుందర్‌సింగ్ (జావెలిన్ త్రో), సింగ్‌రాజ్ అధాన (షూటింగ్), శరద్ కుమార్ (హైజంప్), అవనీ లేఖరా (షూటింగ్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ), మనోజ్ సర్కార్ (బ్యాడ్మింటన్) కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
కొత్త చరిత్ర లిఖించిన అవనీ లేఖరా

పారాలింపిక్స్‌లో పతకం సాధించాలని అథ్లెట్లు కలలుగంటారు. అలాంటిది షూటర్ అవనీ లేఖరా ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి 19 ఏళ్లకే దిగ్గజంగా మారింది. టోక్యోలో ఒక పసిడి, కాంస్యం ఆమె ఖాతాలో చేరాయి. ఈ ప్రదర్శనతో ఒకే పారాలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు నెగ్గిన తొలి భారత మహిళా పారాలింపియన్‌గా ఆమె అవతరించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అవనీకి 2012లో జరిగిన కారు ప్రమాదంలో వెన్నుముక తీవ్రంగా దెబ్బతింది. తీవ్ర నిరాశలో ఉన్న ఆమెను తండ్రి ప్రవీణ్ జగత్‌పురా షూటింగ్ రేంజ్‌లో 2015లో చేర్చాడు. ఆమె ఆ క్రీడపై అమితాసక్తి కనబరించింది. ఆ ఉత్సాహాన్ని గమనించిన తండ్రి.. అభినవ్ బింద్రా ఆటోబయోగ్రఫీ పుస్తకం ఇచ్చాడు. అది చదివాక తానూ మంచి షూటర్‌గా మారాలని అవనీ నిర్ణయించుకుంది. కఠోర సాధనతో తన కలను నిజం చేసుకుంది.
గురి తప్పని మనీష్

మనీశ్ నర్వాల్ పిస్టల్ నుంచి ఈసారి వెలువడిన బుల్లెట్ ఏకంగా విశ్వక్రీడల రికార్డుతో పసిడి పతకానికి తగిలింది. హరియాణాకు చెందిన 19 మనీష్‌కి పుట్టుకతోనే కుడిచేతి లోపముంది. చిన్నప్పటి నుంచీ ఫుట్‌బాల్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనే కల ఉండేది. కానీ వైకల్యం అతనికి అడ్డంకిగా నిలిచింది. స్థానిక క్లబ్ స్థాయిని మించి ముందుకు సాగలేకపోయాడు. నిరాశతో కుంగిపోయాడు. కానీ ఆగిపోలేదు. తండ్రి సూచన మేరకు షూటింగ్ వైపు మరలి 2016లో తొలిసారి తుపాకీ పట్టాడు. అప్పటి నుంచీ పతకాల వేటలో దూసుకుపోతూనే ఉన్నాడు.
సూపర్.. సుమిత్

హరియాణాలో సోనెపట్ జిల్లా ఖేవ్రా గ్రామానికి చెందిన 23 ఏళ్ల జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ స్వర్ణాన్ని ముద్దాడాడు. అతడు ఢిల్లీలోని రామ్‌జాస్ కాలేజీ విద్యార్థి. 2015లో ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా జరిగిన మోటార్ సైకిల్ ప్రమాదంలో అంటిల్ ఎడమ కాలు మోకాలి వరకూ తెగిపోయింది. ఆపరేషన్ తర్వాత కృత్రిమ కాలు అమర్చారు. తన గ్రామానికే చెందిన ఓ పారా అథ్లెట్ సూచన మేరకు పారాలింపిక్స్‌పై దృష్టి పెట్టాడు. జావెలిన్ సాధన చేసే క్రమంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కృత్రిమ కాలు కావడంతో శిక్షణా సమయంలో ఒక్కోసారి లోపల వేడికి రక్తం కారేది. అయినా లెక్కజేయకుండా నిరంతర సాధనతో పారాలింపిక్స్‌లో స్వర్ణం కొల్లగొట్టే స్థాయికి ఎదిగాడు.
అసాధారణ ప్రతిభ.. ప్రమోద్ భగత్

పారాలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్‌లో స్వర్ణాన్ని అందుకున్న ప్రమోద్ భగత్ నిత్య కృషీవలుడు. ఒడిశాలోని బార్గాడ్ జిల్లా అట్టాబీరా అతని స్వగ్రామం. ఐదేళ్ల వయస్సులో పోలియో సోకడంతో ఎడమ కాలు బలహీనంగా మారింది. మొదట్లో క్రికెట్‌పై దృష్టిపెట్టిన అతడు.. ఆ తరువాత బ్యాడ్మింటన్‌వైపు మరలాడు. అసాధారణ ప్రతిభతో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే కాకుండా తాజా పారాలింపిక్స్‌లో పసిడిని అందుకున్నాడు.
సంకల్పశీలి.. కృష్ణ నాగర్

పారా బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిన కృష్ణ నాగర్ తొలి రోజుల్లో మరుగుజ్జు రూపం కారణంగా స్కూల్లో ఎగతాళికి గురయ్యాడు. తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. రాజస్థాన్‌కు చెందిన అతడు టీనేజ్‌లో యాదృచ్ఛికంగా బ్యాడ్మింటన్ ఆడి ఆ క్రీడపట్ల ఆసక్తి పెంచుకున్నాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తనను గేలి చేసిన వారే విస్తుపోయేలా బ్యాడ్మింటన్‌లో ఎదిగాడు.
కోడూరు అప్పలనాయుడు
9491570765