గిరజన కళాకృతుల్లో మారయ్య నైపుణ్యం
ఎంతోమందికి శిక్షణ ఇస్తున్న వైనం
ప్రజాశక్తి - బుట్టాయగూడెం
మండలంలోని అడవి ప్రాంతంలో లభించే వెదురు చెట్లతో గిరిజనులు వివిధ రకాల కళాకృతులను తయారు చేస్తున్నారు. నైపుణ్యం ఉన్న వ్యక్తులు తయారు చేయడంతో వాటికి మరింత ఆదరణ పెరిగింది. వికలాంగుడు అయిన మచ్చ మారయ్య అనే మాస్టారు తను నేర్చుకున్న ఈ కళాకృతుల విద్యను పలువురు గిరిజనులకు నేర్పించడమే కాకుండా తానే స్వయంగా వెదురు కర్రలతో కుర్చీలు, పెన్ బాక్సులు, డబుల్ కాట్ మంచాలు తదితర కళాకృతులను తయారు చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా వైటిసిలో ఈ వస్తువులను తయారు చేస్తూ విక్రయిస్తూ ఉన్నారు. గత కరోనాకు ముందు అమెజాన్ వంటి సోషల్ నెట్‌వర్కింట్ బిజి నెస్‌లో కూడా ఈ వస్తువులకు అత్యంత ఆదరణ లభించింది. ఇటీవల కొన్ని అనివార్య కారణాల వల్ల తయారీ వెనక పడినప్పటికీ గత మూడు నెలలుగా తయారీ పుంజుకుంది. ప్రస్తుతం డబుల్ కాట్ మంచాలు, కుర్చీలు, సోఫా సెట్లు, గిఫ్ట్ ఐటమ్స్ వంటి వస్తువులను ఎంతో అందంగా ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునే విధంగా తయారు చేస్తున్నారు. తను నేర్చుకున్న విద్యను మారయ్య ఇటు కెఆర్ పురం, ఐటిడిఎలోనే కాకుండా ముంజులూరు, ముప్పరిల్ల గ్రామాలతో పాటు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా ఎంతోమందికి ఈ వెదురు వస్తువుల తయారీ మీద శిక్షణ ఇచ్చారు. అక్కడ శిక్షణ పొందిన కళాకారులు పేరంటాలపల్లి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు.
ప్రభుత్వం సహకారం అందించాలి
మచ్చ మారయ్య
వికలాంగుడైన నేను నిరుత్సాహంతో ఉన్న సమయంలో మా మాస్టారు నన్ను ప్రోత్సహించారు. ఆ సమయంలో వెదురుతో కళాకృతులను తయారీ నేర్చుకున్నాను. నైపుణ్యంగా వస్తువులు తయారు చేయడంతో నన్ను మాస్టర్‌గా ఏర్పాటు చేశారు. దీంతో వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయగూడెం మండలాల్లోని అనేకమంది గిరిజనులకు వస్తువుల తయారీపై శిక్షణ ఇచ్చాను. వారు కూడా జీవనోపాధి పొందుతున్నారు. మరింత మందికి సహకారం అందించాలంటే మాకు ప్రభుత్వ సహకారం అందించాలి.










