Nov 20,2023 21:44

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

* కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
ఇచ్ఛాపురం వరకు వెళ్లే వైజాగ్‌-చెన్నై కారిడార్‌ నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లా రూపురేఖలు మారనున్నాయని కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ అన్నారు. విశాఖ వేదికగా ఉత్తరాంధ్ర జిల్లాల నీతి ఆయోగ్‌ జి.హబ్‌ ప్రాంతీయ సమావేశంలో వర్చువల్‌గా కలెక్టరేట్‌ నుంచి సోమవారం పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి తీసుకోగలిగే చర్యలపై చర్చలో ఆయన మాట్లాడారు. అపారమైన గ్రానైట్‌ నిల్వలు, 193 కిలోమీటర్ల సువిశాల సముద్రతీరం, 175 కిలోమీటర్ల జాతీయ రహదారి, ప్రధాన రైల్వే లైన్‌ కలిగి ఉండడం జిల్లా ప్రత్యేకత అని అన్నారు. జిల్లాలో పెద్దఎత్తున ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు, దేవాలయ పర్యాటకానికి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు వలసల జిల్లాగా పేరున్న శ్రీకాకుళానికి ఆ పేరు తొలగిపోతోందన్నారు. అణువిద్యుత్కేంద్ర నిర్మాణంతో ప్రపంచ పటంలో జిల్లాలోని కొవ్వాడకు స్థానం లభిస్తుందని చెప్పారు. సువిశాలమైన సముద్రతీరంలో టూరిజం, జెట్టీలు, ఫిష్‌ లాండింగ్‌ సెంటర్లు నిర్మించడం ద్వారా మత్స్యకారుల వలసల నివారణ సాధ్యమవుతుందన్నారు. ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడుతున్న జిల్లా ప్రజలకు ఈ అపారమైన వనరులను అందించడం ద్వారా మెరుగైన జీవన ప్రమాణాలు మెరుగుపరచవచ్చని వివరించారు. నీతి ఆయోగ్‌ స్పెషల్‌ సెక్రెటరీ అనా రారు, స్టేట్‌ టాక్స్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌, నీతి ఆయోగ్‌ నేషనల్‌ అడ్వైజర్‌ పార్థసారథి రెడ్డి, మెకిన్సీ కంపెనీ ప్రతినిధులు అభిలేష్‌, వరల్డ్‌ రిసోర్స్‌ ఇన్స్టిట్యూట్‌ ప్రతినిధులు తదితరులు లేవనెత్తిన పలు అంశాలకు కలెక్టర్‌ బదులిచ్చారు. 2030-47 నాటికి గ్రోత్‌ హబ్‌ లక్ష్యాలను చేరుకునేందుకు సమ్మిళిత ఆర్థిక విధానాలతో కూడిన మాస్టర్‌ ప్లాన్‌పై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది. జిల్లా నుంచి ఈ సదస్సుకు ముఖ్య ప్రణాళిక అధికారి ఎస్‌.వి.ఎస్‌.ఎల్‌ ప్రసన్న, పర్యాటక అభివృద్ధి అధికారి ఎన్‌.నారాయణరావు, ఎపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ బి.హరిదర్‌రావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ జె.ఉమామహేశ్వరరావు తదితరులు హాజరయ్యారు.