వైఎస్‌ఆర్ వాహనమిత్రకు రూ.11.86 కోట్లు జమ
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో
ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి ధ్యేయమని, వైఎస్‌ఆర్ వాహనమిత్రకు రూ.11.86 కోట్లు జమ చేశామని మంత్రి ఆర్‌కె రోజా, జేసీ బాలాజీ తెలిపారు. రాష్ట్రస్థాయిలో రూ.275.93 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. కలెక్టరేట్‌లోని వీసీహాలులో మంత్రి ఆర్‌కె రోజా, జాయింట్ కలెక్టర్ డికె బాలాజీ, ఎంఎల్‌సి సిపాయి సుబ్రమణ్యం, సత్యవేడు ఎంఎల్‌ఎ కోనేటి ఆదిమూలం లబ్దిదారులతో కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. జేసీ మాట్లాడుతూ వాహన ఇన్స్యూరెన్స్, రిపేరు ఖర్చుల నిమిత్తం వాడాలన్నారు. తిరుపతి జిల్లాలో ఇప్పటివరకూ 11,864మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించామన్నారు. మెగా చెక్కును లబ్దిదారులకు అందజేశారు. కలెక్టరేట్ ఆవరణలో ఆటోను మంత్రి స్వయంగా నడిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ బసిరెడ్డి, రవాణా శాఖ అధికారి సీతారామిరెడ్డి, గూడూరు ఆర్డీవో ఆదినారాయణ, ఎంవిఐలు కుసుమ, శ్రీనివాసరావు, సుబ్రమణ్యం, పుత్తూరు చంద్రశేఖర్ పాల్గొన్నారు.
,వాహనమిత్ర ప్రారంభం సందర్భంగా ఆటోలో
మంత్రి ఆర్‌కె రోజా, ఎంఎల్‌సి సిపాయి సుబ్రమణ్యం










