Jul 08,2023 23:41

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: కరువు ప్రాంతాలలోని వర్షా భావ పరిస్థితులలో పంట నష్టపోయిన రైతులకు వై.యస్‌.ఆర్‌ ఉచిత పంట బీమా పథకంతో ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక కాఫీ హౌస్‌లో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో వ్యవసాయం మరింత అభివృద్ధి చెందాలని, ఇది రైతుల అవగాహన, ఆసక్తి వల్లనే సాధ్యమని అభిప్రాయం వ్యక్త పరిచారు. జిల్లాలో కాఫీ, మిరియాలు, పసుపు, రాజ్మా ప్రధాన పంటలని, మిగిలిన పంటలపై రైతులు ఆసక్తి పెంపొందించుకొని అవగాహనతో పంటలు పండించాలని సూచించారు. మార్కెటింగ్‌ పై అవగాహానా కలిగి ఉండాలన్నారు. మధ్య దళారీలు లేకుండా రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసుకోవడంతో మంచి ధరకు పంటలను అమ్ము కోవచ్చన్నారు. జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాలలో పంటలు పండిస్తుండగా, 1.46 లక్షల ఎకరాలకు రైతు భారోసా అందిస్తున్నామన్నారు. గత ఏడాది 2.75 లక్షల ఎకరాలకు ఇ-క్రాప్‌ చేశామని, మిగిలిన 25 వేల ఎకరాలకు కూడా ఈ ఏడాది ఇ-క్రాప్‌ చేయాలని సూచించారు. అవసరమైన చెక్‌ డ్యామూల నిర్మాణానికి ప్రతిపాదిస్తే మంజూరు చేస్తామని కలక్టర్‌ వెల్లడించారు. వై. యస్‌. ఆర్‌ ఉచిత పంట భీమా కింద జిల్లాలోని 1,623 మంది రైతులకు రూ.2,50,97,036 ముఖ్యమంత్రి డిబిటి పద్ధతి ద్వారా రైతుల ఖాతాలకు నేరుగా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు ఈ పధకం ద్వారా 4,802 మంది రైతులకు రూ. 6.97 కోట్లు లబ్ది చేకూరిందని వివరించారు.
ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, వైఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి రైతు భాందవుడని, అదే బాటలో తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నడుస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వ్యవసాయానికి పెద్ద పీట వేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారని, వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రైతులందరూ తప్పనిసరిగా ఇ-క్రాప్‌ చేయించు కోవాలని, తీసుకున్న రుణాలు తిరిగి సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీలు పొందాలని సూచించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన కలక్టర్‌, ఎంఎల్‌ఎ, ఇతర అతిధులు వైఎస్‌ రాజ శేకర్‌ రెడ్డి జయంతిని పురష్కరించుకొని ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసారు. అనంతరం పంట నష్ట పరిహారం చెక్కును లబ్దిదారులకు అందజేశారు. వ్యవసాయ స్టాళ్లను వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్‌ చైర్మన్‌ శతక బుల్లిబాబు, వ్యవసాయ సలహా మండలి చైర్‌ పర్సన్‌ సరస్వతి, ఎంపిటిసి విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాదికారి బిఎస్‌ఎస్‌ నందు, జిల్లా ఉద్యాన అధికారి రమేష్‌, పలువురు ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సాంప్రదాయ బోకేలకు కలెక్టర్‌ ఫిదా
పాడేరు:సాంప్రదాయ బోకేలను అందుకున్న జిల్లా కలక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వాటిని చూసి ఆనంద పరవశమయ్యారు. రైతు దినోత్సవం పురష్కరించుకొని స్థానిక కాఫీ హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న కలక్టర్‌ను వేదిక మీదకు ఆహ్వానించిన సందర్భంలో కమ్యూనిటి బేస్డ్‌ నేచుర్‌ ఫార్మింగ్‌ సభ్యులు అందించిన ప్రకృతి సిద్ధమైన ఫల పుష్పాలతో తయారు చేసిన బోకేలను అందజేశారు. వీటిని పరిశీలించిన కలక్టర్‌ ఫిదా అయ్యారు. శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి, తయారీదారులైన నేచుర్‌ ఫార్మింగ్‌ సభ్యులతో కాసేపు ముచ్చటించి తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. శాసన సభ్యురాలు వివరిస్తూ నిజానికి ఒకటి పైనాఫిల్‌ పండును బొకే మాదిరి ఆకులతోనూ, రెండోది పసుపు పువ్వును బోకే మాదిరి ఆకులతో అలంకరించారని, వీటిని వెదురు బొంగులో ఉంచి అందజేశారని వివరించారు.