May 17,2023 00:01

చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి, చిత్రంలో అధికారులు, మత్స్యకారులు

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ
సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారుల జీవన భృతి నిమిత్తం వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం చేపట్టారు. విశాఖ కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీనివాసమూర్తి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విశాఖ జిల్లాలో మత్స్యకార భరోసా కింద రూ.12,17,30,000 మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు వాసుపల్లి గణేష్‌ కుమార్‌ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో 12,173 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.10,000 చొప్పున జీవన భృతి పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌, మత్స్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ విజయ, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇన్‌ఛార్జి పూర్ణిమ దేవి, ఫిషరీస్‌ వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్మెంట్‌ డైరక్టర్‌ పి.విజయ చంద్ర, పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లాలో రూ.11.37 కోట్ల మత్స్యకార భరోసా
అనకాపల్లి : అనకాపల్లి జిల్లాలో ఎంపికైన 11,373 మంది మత్స్యకార లబ్ధిదారులకు రూ.11.37 కోట్లు మత్స్యకార భరోసా చెక్కును కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి చేతుల మీదుగా మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సముద్రంలో చేపల వేట నిషేధం సమయం ఏప్రిల్‌ 15 నుండి జూన్‌ 14 కాలంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా అర్హులైన కుటుంబానికి రూ.10 వేలు చొప్పున సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. పరవాడ మండలంలో 868 మందికి రూ.86.80 లక్షలు, అచ్యుతాపురంలో 1825 మందికి రూ.182.50 లక్షలు, రాంబిల్లిలో 1306 మందికి రూ.130.60 లక్షలు, ఎస్‌.రాయవరంలో 2478 మందికి రూ.247.80 లక్షలు, నక్కపల్లిలో 1883 మందికి రూ.188.30 లక్షలు, పాయకరావుపేటలో 3013 మందికి రూ.301.30 లక్షలు లబ్ధి చేకూరుతోందరని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి లక్ష్మణరావు, మత్స్య శాఖ సిబ్బంది, మత్స్యకార ప్రతినిధులు పాల్గొన్నారు.