Jun 26,2023 22:48

ప్రజాశక్తి - ఏలూరు
         కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన అర్హత గల యువ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్లయిఫండ్‌ను సద్వినియోగం చేసుకుని వృత్తిలో పురోగతిని సాధించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అన్నారు. సోమవారం 2023-24 సంవత్సరానికి మొదటి విడతగా రాష్ట్రంలోని 2,677 మందికి వైఎస్‌ఆర్‌ లా నేస్తం స్టయిఫండ్‌ను సిఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి రూ.6 కోట్ల 12 లక్షల 65వేలు ఆర్థికసాయాన్ని బటన్‌ నొక్కి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎవిఎన్‌ఎస్‌.మూర్తి, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లబ్ధిదారులైన యువ న్యాయవాదులతో కలిసి వీక్షించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ 2023-24 సంవత్సరం మొదటి విడతగా ఈ ఏడాది ఫిబ్రవరి నుండి జూన్‌ వరకూ ఐదు నెలలకు నెలకు రూ.ఐదు వేలు చొప్పున జిల్లాలో 88 మందికి రూ.25 వేలు చొప్పున రూ.22 లక్షలు యువ న్యాయవాదుల ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. లా డిగ్రీ పూర్తి చేసి న్యాయవాది వృత్తిలోకి అడుగుపెట్టిన వారికి మూడు సంవత్సరాలకు వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం లా నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ ఆర్థిక సహాయం నెలకు రూ.ఐదు వేలు చొప్పున ఏడాదికి రూ.60 వేలు, అలాగే మూడు సంవ త్సరాలకు రూ.1,80,000 అందజేస్తారని తెలిపారు.