
విశాఖ, అనకాపల్లి జిల్లాలకు వైఎస్‌ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా రెండో విడత నిధులు శుక్రవారం విడుదలయ్యాయి. సిఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలు సాగాయి.
ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ
విశాఖ కలెక్టరేట్‌లోని వీడియో కాన్పరెన్సు హాలులో సిఎం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అనంతరం జిల్లా వ్యాప్తంగా రూ.2 కోట్లా 33 లక్షలా 55 వేల మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ప్రజా ప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. జిల్లాలో 383 జంటలకు ఈ నిదులతో లబ్ధి చేకూరనుందన్నారు. రూ.40 వేలను భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఇవ్వనున్నామన్నారు. అర్హులకు నేటికీ లబ్ధి చేకూరకపోతే జూన్, డిసెంబరు నెలల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్‌పర్సన్ పల్లా చినతల్లి, నగరాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పిల్లా సుజాత, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రమణమూర్తి, గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇన్‌ఛార్జి పూర్ణిమ దేవి పాల్గొన్నారు.
అనకాపల్లి : పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించేందుకు వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి తెలిపారు. కళ్యామస్తు, షాదీతోఫా కింద ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు శుక్రవారం రెండవ విడత నిధులు విడుదల చేసిన సందర్బంగా స్ధానిక కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీతోఫా కింద రెండవ విడత 667 మంది జంటలకు రూ.3,86,70,000 లబ్ధి చేకూరుతుందన్నారు. మొదటి విడతతో కలిసి ఇప్పటివరకు 799 మంది జంటలకు రూ.4,77,05,000 అందజేసినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ జంటలకు రూ.లక్ష చొప్పున, కులాంతర వివాహాలు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు రూ.1.20 లక్షలు, బిసిలకు రూ.50 వేలు, బిసి కులాంతర వివాహం చేసుకున్నవారికి రూ.75 వేలు, వికలాంగులకు రూ.1.50 లక్షలు, రిజిస్టరు అయిన భవన కార్మికులకు రూ.40 వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ బి.వరాహ సత్యవతి, డిఆర్‌డిఎ పిడి లక్ష్మీపతి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి అజరు బాబు, జిఎస్‌విఎస్ ప్రత్యేక అధికారి మంజులవాణి, డిఎల్‌డివో ఉదయశ్రీ, లబ్ధిదారులు పాల్గొన్నారు.