ప్రజాశక్తి-పాడేరు: జిల్లాలోని 51 జంటలకు వైఎస్ ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీ తోఫా పథకాల కింద ఆర్ధిక సాయం రూ.51 లక్షల 50 వేలు ప్రభుత్వం మంజూరు చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ జె.శివ శ్రీనివాస్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఈ పథకాలను ప్రారంభించి ఎంపికైన లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు ప్రజాప్రతినిధులు, అధికారుల వద్దకు వెళ్లకుండానే ప్రభుత్వమే పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం మంజూరు చేసిందని అన్నారు. 49 మంది గిరిజనులకు, ఒక షెడ్యూల్డు కులం, 1 వెనుక బడిన వర్గానికి చెందిన జంటలకు పథకం మంజూరైందన్నారు. ఈ సందర్భంగా తెలిపారు. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు లబ్దిదారు అనంతగిరి మండలం పెదబిడ్డ గ్రామానికి చెందిన లబ్దిదారు బోయిన సువర్ణ రత్న మాట్లాడుతూ, మా నాన్నకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూములకు రైతు భరోసా, మా అమ్మకు ఆసరా, చేయూత పథకాల ఆర్థిక సహాయం అందుతోందన్నారు. మా చెల్లికి విద్యాదీవెన పథకం ఆర్ధిక సహాయ వస్తోందన్నారు. పేదల సంక్షేమానికి ఇన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వి. అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ డిఏ పిడి మురళి, డిఆర్‌ఓ అంబేద్కర్, గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు ఐ.కొండలరావు, 25 జంటల లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.










