Sep 26,2022 23:36

చేయూత లబ్ధిదారులకు చెక్కు అందిస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజు

ప్రజాశక్తి-యంత్రాంగం
వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి సంబంధించిన చెక్కులను పలు మండలాల్లో సోమవారం అందించారు.

పెందుర్తి : మండల పరిధిలోని లబ్ధిదారులకు ఎమ్మెల్యే అదీప్‌రాజు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరి ముఖాల్లో ఆనందం చూడాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డిఒ, డిఆర్‌డిఎ పీడీ, జోనల్‌ కమిషనర్‌, తహశీల్దార్‌, ఎంపీపీ మదుపాడ నాగమణి, కోడిగుడ్ల దేవి సాంబ, ముమ్మన దేముడు, ఎల్‌బి.నాయుడు, ఆదిరెడ్డి మురళి, నక్క కనకరాజు, మెంటి మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-పద్మనాభం : వైఎస్‌ఆర్‌ చేయూతకు సంబంధించిన చెక్కును పద్మనాభం మండల కాంప్లెక్స్‌ ప్రాంగణంలో సోమవారం లబ్ధిదారులకు ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందించారు. 22 గ్రామ పంచాయతీలకు చెందిన 3899 మంది మహిళలకు రూ.7,31,6,250 చెక్కును పంపిణీచేశారు. ముందుగా జగన్మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయడమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రజల సంక్షేమం కోసం సుమారు 23 పథకాలు అమలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కె.రాంబాబు, జెడ్‌పిటిసి సుంకర గిరిబాబు, పార్టీ మండల అధ్యక్షులు కోరాడ లక్షణరావు, వైస్‌ ఎంపిపి ఈర్ల రాజేశ్వరి, ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గంలోని డిఎల్‌బి గ్రౌండ్‌లో మూడో విడత చేయూత పంపిణీ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉపముఖ్యమంత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులకు వైఎస్‌ఆర్‌ చేయూత చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. రాజకీయ, కులమతాలకతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ మహిళలకు చేయూత నగదును అందించి దసరా పండుగను ముందుగానే తీసుకొచ్చారన్నారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ, మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని చెప్పారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమిషనర్‌ టి.రాజాబాబు, ఎంపీ ఎంవివి.సత్యనారాయణ డిప్యూటి మేయర్‌ కె.సతీష్‌, నెడ్‌ క్యాప్‌ చైర్మన్‌ కెకె.రాజు పాల్గొన్నారు.