ప్రజాశక్తి - ఆగిరిపల్లి
మహిళల ఆర్థిక పరిపుష్టికి సిఎం జగన్ కృషి చేస్తున్నారని ఎంఎల్‌ఎ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. ఆగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం నిర్వహించిన ఆసరా మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మండలంలోని 1237 స్వయం సహాయక సంఘాలకు చెందిన 12,734 మంది డ్వాక్రా మహిళకు రూ.12.56 కోట్లు వారి ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి జి.అనూష, జెడ్‌పిటిసి సభ్యులు పి.వీరబాబు, వైస్ ఎంపిపి జి.సాంబశివరావు, కె,రమేష్, ఎంపిడిఒ కె.వాణి, వెలుగు ఎపిఎం బి.రామకృష్ణ, ఎంఎస్ అధ్యక్షురాలు పి.దుర్గాభవాని పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం :వైఎస్‌ఆర్ ఆసరా మూడో విడత పంపిణీ సంబరాలు స్థానిక ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఎల్‌ఎ ఎలిజా మాట్లాడుతూ సిఎం జగన్ మహిళా సాధికారతే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ భవానీప్రసాద్, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, ఎంపిపి కొదమ జ్యోతి పాల్గొన్నారు.
ఊపిరాడక సోమసిల్లి పడిపోయిన మహిళ
స్థానిక ఆలపాటి గంగాభవాని ఫంక్షన్ హాలులో శనివారం నిర్వహించిన ఆసరా మూడో విడత పంపిణీ సంబరాల కార్యక్రమంలో ఓ మహిళ ఊపిరాడక కూప్పకూలింది. ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఎంఎల్‌ఎ ఎలిజా మహిళను పరామర్శించారు. ఆసరా పంపిణీ కార్యక్రమానికి పట్టణంలోని డ్వాక్రా మహిళలు వేల సంఖ్యలో హాజరయ్యారు. దీంతో అనేకమంది సభా ప్రాంగణం బయటకు వచ్చి ఎండలో నిలబడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చేబ్రోలు వరలక్ష్మి ఊపిరి ఆడక కుప్పకూలిపోయింది. వెంటనే హెడ్ కానిస్టేబుల్ జెట్టి శేఖర్ వరలక్ష్మిని చేతులపై మోస్తూ పోలీస్ వాహనంలో ఎక్కించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల పర్యవేక్షణలో వైద్యం అందించారు. చికిత్స పొందుతున్న వరలక్ష్మిని ఎంఎల్‌ఎ ఎలిజా పరామర్శించారు. వరలక్ష్మికి షుగర్ లెవెల్ తగ్గిపోవడంతో సోమసిల్లి పడిపోయారని వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ దేవి కమల తెలిపారు.
ఆసరా సంబరాలకు డ్వాక్రా మహిళలు కచ్చితంగా హాజరు కావాలని సంబంధిత అధికార సిబ్బంది హుకుం జారీ చేయడంపై పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత తమకు తాగేందుకు సరిపడా నీరు కూడా అందుబాటులో లేదని వాపోయారు. ప్రాంగణంలో ఊపిరి అందక బయట ఎండలో నిలవలేక తిరుగుపయనం అయ్యేందుకు సిద్ధమైన మహిళలను గేట్లు మూసివేసి నిర్బంధించడం సరికాదని పలువురు డ్వాక్రా మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేసవి దృష్ట్యా సభా సమావేశాలు నిర్వహించే ప్రాంతంలో చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.










