ప్రజాశక్తి -పాడేరు:ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు అందుబాటులో ఉంటూ రోగులకు సేవలు అందించాలని జిల్లా కలక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. శనివారం పాడేరు డివిజన్ ఫరిదిలోని 35 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ అధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలక్టర్ మాట్లాడుతూ, నాన్ కమ్యూనికబుల్ వ్యాధుల స్క్రీనింగ్స్ సక్రమంగా నిర్వహించి, సంబంధిత పోర్టల్ లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. తక్కువగా స్క్రీనింగ్ నిర్వహించిన మెడికల్ అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. పిహెచ్‌సి మెడికల్ అధికారులు క్రమం తప్పకుండా ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించి, ఎఎన్‌ఎంలు, ఆశాలతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం పూర్తి స్థాయిలో ఇమ్మ్యునైజేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, బిసిజి, ఒపివి, మీజిల్స్ తదితర అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. జనన రిజిస్టర్లలో పిల్లల వివరాలు నమోదు చేసి, హైరిస్క్ గర్భిణీల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హైరిస్క్ గర్భిణీలను ప్రసవాలకు ముందుగానే బర్త్ వెయిటింగ్ కేంద్రాలకు తరలించాలని సూచించారు. గర్భిణీల వివరాలు జనని సురక్ష యోజనలో అప్‌లోడ్ చేయాలని, వారికి అందాల్సిన పారితోషికం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక నుండి ప్రతి రెండు వారాలకు సమీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ఆలస్యంగా హాజరైన ఆర్‌వి నగర్, సుంకరిమెట్ట, భీమవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ అధికారులకు వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఎంహెచ్‌ఓ జమాల్ భాషా, జిల్లా క్షయ నియంత్రణాదికారి విశ్వేస్వర నాయుడు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ అధికారులు పాల్గొన్నారు.










