Jun 20,2023 19:28

పరిసరాలను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
డివిజన్‌ కేంద్రమైన ఆదోని ఏరియా ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయం అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశాలు నిండుగా ఉన్నాయి. అక్కడ రోగులు పడుతున్న ఇబ్బందులను ఇటీవల పత్రికలు ప్రచురించాయి. సమస్యలను, రోగులు పడుతున్న ఇబ్బందులను కళ్లకు కట్టినట్లు ప్రచురించడంతో ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ స్పందించారు. మంగళవారం సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఆ సమయంలో డ్యూటీలో డాక్టర్లు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వైద్యులు పద్ధతి మార్చుకోవాలని పలుసార్లు సూచించినప్పటికీ విధులకు డుమ్మా కొడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ వివరించారు. రోగులకు వడ్డిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో ఇలాగే వడ్డిస్తే చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. రోగుల వార్డులోని మరుగుదొడ్లను పరిశీలించారు. నీటి సౌకర్యం, పారిశుధ్య పనులను సక్రమంగా నిర్వహిస్తున్నారా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. పాము, తేలు కాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా అంటూ ఫార్మాసిస్టును అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని పలుమార్లు సూచించినప్పటికీ ఆస్పత్రి వైద్యులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అంతు పట్టడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఆస్పత్రి అంతా కలియదిరిగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, లేకపోతే వేరే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్‌ చేయించుకోండని ఉద్యోగులకు సూచించారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లింగన్నను మీడియా వివరణ కోరగా... ప్రస్తుతం వైద్యులు బదిలీల ప్రక్రియ ఉందని, లాంగ్‌ స్టాండ్‌ ఉన్న వారిని మార్చుతామని తెలిపారు. తాను కూడా సెలవులో ఉన్నానని, ఈ విషయాన్ని సబ్‌ కలెక్టర్‌కు వివరించానని చెప్పారు. సబ్‌ కలెక్టర్‌ వెంట డాక్టర్‌ ఆది నాగేష్‌ ఉన్నారు.