Jun 18,2021 06:42

   రోనా వ్యాధి విరుచుకుపడినప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్రమైన ఒత్తిడిలో పని చేస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో కోవిడ్‌ రెండో వేవ్‌ తీవ్రతరమైన దశలో ఈ ఒత్తిడి అసాధారణ స్థాయికి చేరింది. భారతీయ వైద్యుల సంఘం (ఐ.ఎం.ఎ.) గణాంకాల ప్రకారం కరోనా రెండవ దశ సమయంలో రోగులకు చికిత్స చేస్తూ 700 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు వీరికి మరొక కొత్త సమస్య తోడయ్యింది. యోగా గురువుగా ప్రజలదృష్టిని ఆకర్షించి, ''పతంజలి'' పేరుతో వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న 'బాబా' రామ్‌దేవ్‌ ఆధునిక వైద్యాన్ని, వైద్యులను చులకన చేస్తూ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైద్యులను తీవ్రమైన ఆగ్రహానికి, ఆవేదనకు గురి చేశాయి. మరోవైపు దేశంలో వివిధ ప్రాంతాలలో రోగులకు సరైన సేవలు అందించడం లేదంటూ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను అరికట్టమని దేశ ప్రధానిని, హోం మంత్రిని, రాష్ట్రాల ముఖ్య మంత్రులను పదే పదే కోరినా ఏమీ ప్రయోజనం కనిపించడంలేదని ఐ.ఎం.ఎ. నాయకులు విచారం వ్యక్తం చేశారు. రాందేవ్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ, దాడుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ నేడు (జూన్‌ 18వ తేదీన)...తమ విధులు నిర్వహిస్తూనే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఐ.ఎం.ఎ. పిలుపునిచ్చింది.
    కరోనా రెండవ దశ పెద్ద ఎత్తున ప్రజలను కబళించింది. కేసులు ఉధృతంగా పెరుగుతూ ఎప్రిల్‌ 23 నాటికి 67,013 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఒక్క రోజులో ఇన్ని కోవిడ్‌ కేసులు నమోదవ్వలేదు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులకు చేరుకుంటున్న రోగులకు హాస్పిటల్‌ బెడ్లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, ఔషధాల కొరతతో సకాలంలో వైద్యం అందలేదు. తమ ఆత్మీయుల కళ్ల ముందే రోగులు శ్వాస కోసం పెనుగులాడుతూ ప్రాణం విడిచిన దృశ్యాలు మీడియాలో చూసిన ప్రజలను ప్రాణ భయం వెన్నాడింది. మరోవైపు ప్రయివేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, అధిక ధర చెల్లించి బ్లాక్‌ మార్కెట్‌లో మందులు కొనుక్కోవాల్సి వస్తుందని వచ్చిన వార్తలు ప్రజల్లో తీవ్రమైన ఆందోళన, ఆగ్రహాలను కలిగించాయి. వాస్తవానికి ప్రభుత్వ, ప్రయివేట్‌ ఆసుపత్రులలో జరుగుతున్న ఈ పరిణామాలకు వైద్యులు, వైద్య సిబ్బంది కారణం కాదు. తక్షణం కళ్ల ముందు కనిపించేది వారే... పైగా ముందే చెప్పినట్లుగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ఈ కారణంతో రోగి కుటుంబ సభ్యుల ప్రశ్నలకు సరిగా సమాధానం ఇవ్వలేదనో, సరైన చికిత్స అందించడం లేదనో దేశంలో అనేక చోట్ల వైద్యులపై దాడులు జరిగాయి. ఈ తక్షణ కారణాలతో పాటు సమాజంలో నెలకొన్న ధోరణులు ఈ దాడులకు కారణమవుతున్నాయి. వైద్యులపై దాడులకు పాల్పడిన వారిపై తగిన విచారణ జరిపి, శిక్ష విధించిన ఉదంతాలు దాదాపు లేవు. దీంతో ఈ నేరానికి పాల్పడడానికి దుండగులు భయపడడం లేదు.
    ప్రభుత్వాలు ఇటువంటి దాడులను నివారించడానికి, దాడులకు పాల్పడిన వారిని శిక్షించడానికి చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రులపై దాడులను 'డాక్టర్లకు సంబంధించిన వ్యవహారంలే' అని ఉదాసీనంగా ఊరుకోకుండా ప్రజలు, ప్రజా సంఘాలు గట్టిగా ఖండించాలి. వ్యవస్థ లోని లోపాలకు వైద్యులు, ప్రజలు ఒకరిని ఒకరు నిందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. నైతిక విలువలు పాటించే వైద్యులు, అందరికీ ఆరోగ్యాన్ని కోరుకునే ప్రజలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు 'ఉమ్మడి వేదికలు' ఏర్పరచుకోవడం నేటి తక్షణ అవసరం. వైద్యులు, ప్రజల మధ్య అర్ధవంతమైన చర్చ జరగడానికి, నైతిక వైద్యులకు సంఘీభావం తెలియ చేయడానికి, ప్రజలకు వ్యాధి నివారణ, ఆరోగ్య పరిరక్షణపై శాస్త్రీయ అవగాహన కల్పించడానికి, విధాన పరమైన మార్పుల కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ వేదికలు ఉపకరిస్తాయి. పౌర సమాజం నుంచి వచ్చే అటువంటి చొరవ మాత్రమే నైతిక వైద్యులను 'అంతరించి పోతున్న జాతులు' కాకుండా కాపాడగలదు. వైద్యులు ప్రజలపై విశ్వాసం ఉంచి, వారి సహకారంతో తమ లోని కలుపు మొక్కలను ఏరి వేయడం ద్వారా తగిన ఆదాయం పొందుతూనే వైద్య వృత్తికి పూర్వపు గౌరవాన్ని తీసుకు రాగలుగుతారు.
 

డా|| ఎస్‌. సురేష్‌

డా|| ఎస్‌. సురేష్‌

/ వ్యాసకర్త ప్రజారోగ్య నిపుణులు, సెల్‌ : 9392605395 /