Jul 09,2023 23:43
సీనియర్‌ వైద్యులను సన్మానిస్తున్న రాష్ట్ర ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్‌ రవికృష్ణ, ప్రతినిధులు

ప్రజాశక్తి-చీరాల: వైద్యులపై దాడులు జరిగితే కఠిన కఠిన శిక్షలు అమలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, వైద్యులు ఆసుపత్రుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి అని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ రవికృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఫణిధర్‌ అన్నారు. ఆదివారం రామాపురంలోని ప్లామ్‌ కోస్ట్‌ రిసార్ట్‌లో జరిగిన ఐఎంఏ 19వ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ వర్క్‌ షాప్‌నకు చీరాల ఐఎంఎ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్‌ శ్రీదేవి, పి శ్రీకాంత్‌ల ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఐఎంఏ అంటే ప్రైవేట్‌ వైద్యుల సంఘం అనే అపోహ ఉందని కానీ తమ సంఘం సభ్యులు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రాలలో వైద్య కళాశాలలో సేవలు అందిస్తున్నారని అన్నారు. వైద్యులపై ఇటీవల కాలంలో అధికంగా దాడులను జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలని అన్నారు. 2008లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైద్యుల పరిరక్షణ చట్టాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకురావడం జరిగిందని ఆ తర్వాత 16 రాష్ట్రాల్లో ఈ విధమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చారని అన్నారు. వైద్యుల చట్టంలో పలు మార్పులు తీసుకురావాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య విధానాలను రూపొందించే సమయంలో ఐఎంఏను భాగస్వామ్యం చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంత వైద్యులు అనారోగ్య సమయంలో ప్రజలకు అధికంగా యాంటీబయాటిక్‌ డోసులు ఇస్తూ ఇతర అనారోగ్య సమస్యలను వారికి తీసుకువస్తున్నారని, అలాంటి వైద్యాన్ని ప్రభుత్వం అరికట్టాలని అన్నారు. ఆయుర్వేదం, అల్లోపతి, వైద్య రంగాన్ని అందరూ గౌరవిస్తున్నామని అయితే వాటికి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి కానీ వాటన్నింటినీ ఒకే విధానంలోకి తీసుకువచ్చే కిచిడి విధాన ప్రయత్నం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని, దానిని ఐఎంఏ పూర్తిగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఐఎంఏ వైద్య రంగానికి పరిమితం కాకుండా సేవా కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలను తీసుకొని వారికి వైద్య సేవలను అందిస్తుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైద్య పురస్కారాలు ఇవ్వాలి
జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉన్నత సేవలు అందించిన వైద్యులకు రాష్ట్రస్థాయి పురస్కారాలు ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంత సీనియర్‌ వైద్యులయిన డాక్టర్‌ బాల శంకర్రావు, డాక్టర్‌ కెవి పుల్లారావు, డాక్టర్‌ ఉమామహేశ్వరరావులను ఐఎంఏ రాష్ట్ర నాయకులు సన్మానించారు. ఐఎంఏ జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ భవానీ ప్రసాద్‌ పర్యవేక్షణలో జరిగిన సమావేశంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ, జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ శ్రీహరి, రాష్ట్ర ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఫణిధర్‌, రాష్ట్ర ఐఎంఏ కోశాధికారి డాక్టర్‌ రవీంద్రనాథ్‌, రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ డాక్టర్‌ జెసి నాయుడు, ఇమిడియట్‌ పాస్ట్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరాజు, బాపట్ల ఐఎంఎ అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌ ఎస్‌ హక్‌, మధు సాల్మన్‌ పలువురు పాల్గొన్నారు.
కేంద్ర ఇండియన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ప్రవేశపెట్టాలి
కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌లో బ్రిటిష్‌ కాలంలో ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌ ఉండేదని, దాన్ని తిరిగి పునరుద్ధరించడం ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులే వివిధ స్థాయిలో నిర్వాహక అధికారులుగా సరైన విధానాలు రూపొందించడానికి అమలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుందని అందుకోసం ఐఎంఎస్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు.
- ఐఎంఏ ద్వారా సామాజిక సేవ
సామాజిక బాధ్యతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఐఎంఏ పలు గ్రామాలను దత్తత తీసుకుందని, ఆ గ్రామంలో వైద్యం పరంగా అన్ని విధాలా గ్రామ ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. ఐఎంఏ పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఆరోగ్య అవగాహన సదస్సులు, విద్యాసంస్థలలో ఆరోగ్య సదస్సులు కౌమార బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం రక్తహీనత నిర్ధారణ వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య సంబంధమైన జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు నిర్వహించి రోగాలు రాకముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన పెంచడానికి ఐఎంఎస్‌ శాఖలు అనుబంధ మహిళ విభాగాలు కృషి చేస్తున్నాయని అన్నారు.
- వైద్యులపై కేసుల నమోదుకు నిర్దిష్ట నియమావళి ఉండాలి
ఆసుపత్రాల్లో రోగులు చనిపోయిన సందర్భాలలో చికిత్సలలో లోపాలపై వైద్యులపై వైద్య నిర్లక్ష్యం కేసులు నమోదు చేసే సమయంలో సుప్రీంకోర్టు తీర్పులు పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ముగ్గురు వైద్య నిపుణుల కమిటీ ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించిన తర్వాత మాత్రమే కేసులు నమోదు చేయాలన్నారు. వైద్యులపై నిర్లక్ష్యం ఆరోపణలపై కేసులు నమోదు చేసినప్పటికీ వైద్యులని అరెస్టు చేయడానికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పోలీసు విభాగాలలో ఎస్‌ఓపి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.