మందులు వ్యాధులను నయం చేస్తాయి. కానీ, డాక్టర్లు మాత్రమే రోగులను నయం చేయగలుగుతారు. - కార్ల్ జంగ్
మతాలు వేరైనా..కులాలు వేరైనా.. అందరూ చేతులెత్తి మొక్కేది డాక్టర్లకే. రోగుల నడుమ, కోవిడ్ వంటి ప్రాణాంతక వైరస్‌ల మధ్య సహజీవనం చేస్తూ వైద్య బాధ్యతలను నిర్వర్తిస్తూ రోగుల ప్రాణాలను కాపాడటం చిన్న విషయం కాదు. హాస్పిటళ్ల లోనూ, ఐసీయూల లోనూ వచ్చే ఇన్ఫెక్షన్ల నడుమ రోగులకు వైద్యం చేస్తూ చాలా సందర్భాలలో వారు కూడా ఈ ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ రోగులను రక్షిస్తారు వైద్యులు. అనుక్షణం ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక స్థైర్యాల్ని అందిస్తుంటారు ఈ వైద్య నారాయణులు.
అంతే కాదు తాము చేపట్టిన విధులలో తమకు సోకిన ఇన్ఫెక్షన్లను తమ నుంచి వాళ్ల జీవిత భాగస్వామికీ, తాము ప్రేమగా చూసుకొనే తమ పిల్లలకూ వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాల నుంచి అందరినీ రక్షించడానికి వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడతారు డాక్టర్లు.
అందరి ప్రాణాలూ కాపాడటానికి అహరహం అలుపెరుగకుండా శ్రమించే వైద్యులు వ్యక్తిగత జీవితాన్ని చాలా కోల్పోతున్నారనే చెప్పవచ్చు. ఒక్కోసారి ప్రాణాంతక వ్యాధుల బారిన పడి ప్రాణాలను సైతం కోల్పోతున్న ఘటనలు అనేకం.
మరేదైనా వృత్తిలో ఉన్నవారికి వారంలో ఒక రోజు లేదా 2 రోజులు సెలవులు ఉంటాయి. అవసరమైతే మరిన్ని సెలవులు తీసుకోవచ్చు. డాక్టర్‌కు సెలవులు లేవు. నిర్ణీత సమయం తరువాత ఇంటికి చేరుకున్నప్పటికి అత్యవసర కేసు వచ్చినట్లయితే పరుగు పరుగున రావాలి. మరలా ఎప్పుడు ఇంటికి వెళ్ళేది వాళ్ళ చేతులలో ఉండదు.
మన దేశంలో వైద్యుల కొరత ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో ప్రకటించింది. ప్రతి 1622 మంది ప్రజలకు ఒక డాక్టర్ అందుబాటులో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సుల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉండాలి. ప్రజలు డాక్టర్ నిష్పత్తిలో మన దేశం 57వ స్థానంలో ఉంది. పొరుగుదేశం పాకిస్తాన్ కన్నా మనం వెనుకబడే ఉన్నాం. డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాల మేరకు డాక్టర్లు లేకపోవడం వలన ఉన్న డాక్టర్ల పై వత్తిడి పెరిగి విరామం ఎరుగకుండా సేవలు అందిస్తున్నారు.
వృత్తిపరంగా అందరికంటే ఎక్కువ సామాజిక గౌరవం పొందినప్పటికి ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ప్రధానంగా వైద్యం అనేది నేడు కార్పొరేట్ పరం అయిపోయింది. వీటిలో పని చేసే వైద్యులకు దీనితో సంబంధం ఉండదు. కేవలం వారు ఉద్యోగులు మాత్రమే. వైద్యం కూడా చాలా ఖరీదు అయిపోయింది. దీని ద్వారా ఆర్జన కార్పొరేట్ వర్గాలకు లభిస్తాయి తప్ప వైద్యులకు కాదు. అయితే ఇక్కడ ప్రత్యక్ష సంబంధం వైద్యులకు రోగులకు మాత్రమే ఉంటుంది. 'మేం డబ్బు కడుతున్నాం. మీరు వైద్యం చేయండి' అనే అభిప్రాయం ఎక్కువగా బలపడింది. జనాలు కూడా డబ్బు కడితేనే వైద్యం అందుతుందనే భావనలో ఉన్నారు. అలాంటప్పుడు రోగికి వైద్యం జరిగేటప్పుడు, ఆ రోగి మరణిస్తే రోగి బంధువులు డాక్టర్ను నేరగాడిగా చూస్తున్నారు. కొన్ని చోట్ల డాక్టర్ల మీద దాడులు చేయడం మనందరికీ విదితమే.
కోవిడ్ మహమ్మారి విస్తరించిన ప్రస్తుత తరుణంలో దేశ వ్యాపితంగా వందలాది మంది డాక్టర్లు మొదటి వేవ్ రెండవ వేవ్ లో కరోనాకు తమ ప్రాణాలను బలిచ్చారు. ఎంతో మంది జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది కూడా వైద్య సేవలో మహమ్మరికి బలయ్యారు. కనీసం డాక్టర్లకు పి.పి.యి కిట్లు కూడా అందించ లేని స్ధితిని కూడా మన దేశంలో చూశాం. అటువంటి ప్రతికూల పరిస్ధితులలో కూడా వైద్యులు సేవలు చేశారు. ఈ సమయంలో ఇంటికి వెళ్లకుండా హాస్పిటల్ లోనే గడిపే డాక్టర్లు ఎందరో. వీరికి ఒక సమయం అంటూ లేదు. విరామం లేదు.. మరొక పక్క బెడ్లు అందుబాటులో లేక పోవడం. పి.పి.ఇ కిట్ లో గంటల కొద్దీ ఉండటం వలన అనేక విధాలైన అసౌకర్యం. మరోవైపు హాస్పిటల్ లో ఆక్సిజన్ అందుబాటులో లేకపోయినా డాక్టర్ల పైనే దాడులు. కుటుంబ సభ్యుడికి కోవిడ్ సోకితే కనీసం అంబులెన్స్ దగ్గరకు కూడా రాని వారున్న నేటి సమయంలో...వైద్య సేవలు అందిస్తూ సహచర వైద్యులు కోవిడ్ సోకి మరణించినా...వృత్తి బాధ్యతలు నుండి వైదొలగకుండా సేవలు అందిస్తున్న వైద్యులకు... వారి కుటుంబ సభ్యులకు...మనం ఎంతైనా రుణ పడి వున్నాం.
- రుద్రరాజు శ్రీనివాసరాజు, లెక్చరర్, సెల్ : 9441239578.










