Nov 02,2023 21:19

ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న మృతుడి బంధవులు,

            ప్రజాశక్తి-అనంతపురం   మూడు రోజులుగా చికిత్స తీసుకుంటున్న చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన మద్దిలేటి (63) వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని స్నేహలత ఆసుపత్రి ముందు బంధువులు గురువారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు మాట్లాడుతూ మదిలేటి మూడేళ్లుగా కిడ్నీ సంబంధిత వైద్యులు డాక్టర్‌ హరీష్‌ వద్ద వైద్యం తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే మూడు రోజులుగా మద్దిలేటి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో డయాలసిస్‌ కోసం స్నేహలత ఆసుపత్రిలో చేరారు. డాక్టర్‌ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో గురువారం తన తండ్రి చనిపోయాడని కుమారుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పరిస్థితి విషమించడంతో వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోగా, ఫోన్‌ చేసినప్పటికీ స్పందించకపోగా చికిత్స కోసం ఇంటి వద్దకు వెళ్లి వైద్యులను తీసుకొచ్చానని వాపోయాడు. చికిత్స మొదలు పెట్టిన 15 నిమిషాల్లో ప్రాణాలు వదిలాడని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మద్దిలేటి మృతిచెందాడని వాపోయారు. వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యశాఖ అధికారిణి దేవి ఆసుపత్రికి చేరుకుని విచారించారు. మృతిపై వివరాలు తెలుసుకునేందుకు నిజనిర్ధారణ కమిటీని వేస్తున్నట్లు తెలిపారు. మృతుడి బంధువుల ఆరోపణ మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి తప్పిదాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కార్డియాక్‌ అరెస్ట్‌ జరిగింది..
మూడు రోజులుగా వైద్యుడు మద్దిలేటికి తగిన చికిత్స అందిస్తున్నాం. అయితే మల్టిపుల్‌ కాంప్లికేషన్స్‌ న్యూరో సంబంధిత సమస్యలు కారణంగా కార్డియాక్‌ అరెస్టు అయ్యారు.
డాక్టర్‌ మనోరంజన్‌రెడ్డి, స్నేహలత ఆసుపత్రి డైరెక్టర్‌