Aug 03,2023 21:19

మృతిచెందిన ఎస్తేరు రాణి

చాపాడు : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తల్లీబిడ్డ మృతిచెందారు. ఆగ్రహానికి గురైన మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వివరాల మేరకు.. ఖాజీపేట మండలం రావులపల్లికి చెందిన ఎస్తేరు రాణి (25)కి గత ఏడాది కర్నూలు జిల్లా గడివేముల మండలం మంచాలగుట్ల వాసి చిన్ననాగన్న (జోసెఫ్‌)తో వివాహమైంది. మంగళవారం రాత్రి ప్రసవ నొప్పులతో బాధపడుతూ ఎస్తేరు రాణఙ మైదుకూరు పిహెచ్‌సిలో చేరారు. అక్కడ వైద్యురాలు శ్రీలలిత పరీక్షలు నిర్వహించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని, ఆస్పత్రిలో ఉండాలని సూచించారు. బుధవారం మధ్యాహ్నం మళ్లీ పరీక్షించారు. అదే రోజు సాయంత్రం నొప్పులు అధికమవ్వడంతో అత్యవసరంగా ఆమెకు ఆపరేషన్‌ చేశారు. అప్పటికే బిడ్డ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసమయంలో రక్తస్రావం కావడంతో తల్లి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. అంబులెన్స్‌లో ఆమెను కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డ మృతిచెందారని ఆమె బంధు వులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేయడంతో వారు శాంతించారు. మృతురాలి తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడపకు తరలించారు. తొచూలు కాన్పులో తల్లీబిడ్డ మృతిచెందడంతో ఎస్తేరు రాణి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. కాగా తల్లీబిడ్డ మృతి పట్ల మైదుకూరు డిఎస్‌పి వంశీధర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.