Nov 18,2023 00:16

రోగులు, వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న ఎంపిపి కారం లక్ష్మి

ప్రజాశక్తి- విఆర్‌.పురం
మండలంలోని రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు విధుల్లో లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, నర్సులతో రోగులకు వైద్య సేవలు అందించడంపై ఎంపిపి కారం లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపిపి నేతృత్వంలో సిపిఎం బృందం శుక్రవారం రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలను సందర్శించింది. ఆస్పత్రిలో ఉండాల్సిన డాక్టర్‌ లేక, ఆయనకు కేటాయించిన సీటు ఖాళీగా ఉండటంపై ఎంపిపి ఆరా తీశారు. డాక్టర్‌ ఒక్క రోగిని కూడా చెయ్యి పట్టుకొని పరీక్షించలేదని అక్కడున్న పరిస్థితిని బట్టి అర్థమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై అక్కడున్న వైద్య సిబ్బందిని అడగ్గా, వైద్యులు భోజనానికి వెళ్లారని చెప్పారు. ఏజెన్సీలోని ప్రభుత్వ వైద్యశాలల్లో ఇదే విధంగా ఉంటే రోగులకు వైద్యం అందని ద్రాక్ష అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలు నర్సులు చేస్తే డాక్టర్‌ ఎక్కడికి వెళ్లినట్టు అని ఎంపిపి ప్రశ్నించారు. ఇప్పటికైనా రేఖపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు రెగ్యులర్‌గా విధులు నిర్వహించాలని, లేకుంటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎంపిపి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చినబాబు, నాయకులు పంకు సత్తిబాబు, గుండెపూడి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.