ప్రజాశక్తి-చీరాల: సమాజ సేవలో తమవంతు బాధ్యతగా రమేష్ హాస్పిటల్స్ సమాజంలో ప్రజలందరికీ వైద్యం అందాలనే దృక్పథంతో టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఆదివారం చీరాల కామధేను కాంప్లెక్స్ వద్ద ఉన్న రమేష్ స్పెషాలిటీ క్లినిక్‌లో ఏర్పాటు చేసిన ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం విశేష స్పందన లభించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగిన ఈ శిబిరానికి చీరాల నలుమూల నుండి అదే సంఖ్యలో ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతిని ఎంఎం కొండయ్య ఏర్పాటు చేసి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మమత రాయపాటి మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో లేని ప్రాంతాలలో ఇలాంటి వైద్య పరీక్షలు, నిపుణులైన వైద్యులతో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 1200కు పైగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామని అందులో భాగంగా చీరాల ప్రాంత ప్రజలు సుమారు 1735 మంది హాజరూ కాగా మెడికల్ క్యాంపును నిర్వహించి వైద్య పరీక్షలతోపాటు మందులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు. రమేష్ హాస్పిటల్స్ బిజినెస్ హెడ్ డాక్టర్ కార్తీక్ చౌదరి మాట్లాడుతూ కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, యూరాలజీ, పల్మనాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, ప్రత్యేక అంటు వ్యాధుల వైద్య నిపుణులు ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారని తెలిపారు. అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ గుర్తింపు కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరులో ఉన్న ఏకైక 350 పడకల రమేష్ హాస్పిటల్స్‌లో అవయవ మార్పిడి చికిత్సల నుంచి అన్ని రకాల క్లిష్టమైన సూపర్ స్పెషాలిటీ వైద్య చికిత్సలను అందిస్తున్నామని అన్నారు. రమేష్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్‌బాబు సంకల్పంతో రమేష్ హాస్పిటల్స్ ఆరోగ్య భాగ్యం పథకం ద్వారా ప్రత్యేకమైన రాయితీలతో ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్ వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తిక్, పలువురు వైద్యులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.










