ప్రజాశక్తి-పెదబయలు:గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో గిరిజన విద్యార్థులు గజ్జి వంటి చర్మవ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే చర్మవ్యాధుల నివారణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించాలని గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి.అప్పలనరస డిమాండ్ చేశారు. పెదబయలు మండలం రూడకోట చుట్టు ప్రక్కల గ్రామాల్లో గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు అప్పలనర్స, రాష్ట్ర నాయకులు బొండ సన్ని బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృధ్వీరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొర్ర నరసయ్య, మండల నాయకలు పప్పుల బుజ్జి బాబుతో కూడిన ప్రతినిధి బృందం పర్యటించారు. శుక్రవారం రూడ కోట గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో సుమారు 160 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా వారిలో సుమారు 65 మంది గిరిజన విద్యార్థులు గజ్జి, తామర చర్మ వ్యాధుల బారినపడి అస్వస్థతతో అవస్థలు పడుతున్నట్లు గుర్తించారు. చర్మ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం ప్రాథమిక వైద్యం అందించినప్పటికి గజ్జి నివారణకు మెరుగైన వైద్యం అందడం లేదని అప్పలనర్స తెలిపారు. గతంలో పాఠశాల విద్యార్థులకు సబ్బులు, కొబ్బరి నూనె ఇచ్చే వారని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మ ఒడి పథకం అమలు చేయడంతో కాస్మోటిక్స్ విద్యార్థులకు అందలేదన్నారు. దీంతో, చర్మ వ్యాధులతో గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చర్మ వ్యాధుల నివారణకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.










