Mar 09,2023 23:45

వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి

ప్రజాశక్తి-అడ్డతీగల
స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవలో వైద్య సిబ్బంది ఎటువంటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినా కఠిన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. గురువారం సాయంత్రం ఆమె కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించి వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఆసుపత్రిలో కొన్ని ఎమర్జెన్సీ కేసుల పట్ల సిబ్బంది నిర్లక్ష్య వైఖరిగా ఉంటున్నట్లు ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. తన సొంత మండలంలో వైద్య సేవలు ఈ విధంగా కొనసాగితే సిబ్బంది నిర్లక్ష్యంపై లోతుగా విచారణ జరపాల్సి ఉంటుందని హెచ్చరించారు. చాలామంది సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావడం లేదని పలువురు ఆరోపిస్తున్న విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకొచ్చారు. డాక్టర్‌ అనూష మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన తుప్పలను తొలగించాలని, వీధి దీపాలను ఏర్పాటు చేయాలని, మంచినీటి వసతులను మెరుగుపరచాలని ఎమ్మెల్యే ధనలక్ష్మికి విన్నవించారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై అప్పలరాజు, వైసిపి నాయకులు సామిదాల రాజా రమేష్‌, అడపా పెద్దకాపు ఎంపీటీసీ వడ్లమూరి రత్నం, నిమ్మల శీను, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.