Sep 15,2023 21:51

విజయనగరం మెడికల్‌ కళాశాలను ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  రాష్ట్రంలో దశలవారీగా 17మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చాక వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తోందని అన్నారు. వైద్యులు, సిబ్బంది భర్తీలో కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వమే మెరుగ్గా ఉందన్నారు. విజయనగరం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని నేరుగాను, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాల మెడికల్‌ కాలేజీలను వర్చువల్‌ పద్ధతిలో శుక్రవారం సిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం మెడికల్‌ కాలేజీల విద్యార్థులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, పలు కళాశాల పీజీ విద్యార్థులతో సిఎం ఆన్‌లైన్‌లో ముచ్చటించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉన్నాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించేందుకు ప్రణాళిక చేసిందని అన్నారు. అందుకోసం రూ. 8,480 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే తొలివిడతగా ఏర్పాటుచేసిన ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు, భవన సముదాయాలు ప్రారంభిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను, ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలోనూ ఒక మెడికల్‌ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఉన్న మెడికల్‌ కాలేజీల్లో 2,185 సిట్లు ఉన్నాయని, తాజాగా ప్రారంభించిన ఐదు కళాశాలతో సీట్ల సంఖ్య 2,935కి చేరుతుందని అన్నారు. తాము తలపెట్టిన మిగిలిన 12 కాలేజీలు పూర్తయితే మొత్తంగా రాష్ట్రంలో 4,735 మెడికల్‌ సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. మరో 18 నర్సింగ్‌ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సిఎం వెల్లడించారు. ఈ కాలేజీల ద్వారా పీజీ మెడికల్‌ సీట్ల సంఖ్య నాలుగేళ్లలో 966 నుంచి 1,767కు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకుని సమాజానికి సేవలందించాలని విద్యార్థులకు సూచించారు.
గత నాలుగేళ్లలో రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు-నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు ఇచ్చినట్లు సిఎం చెప్పారు. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీచేస్తున్నామని, ఇప్పటి వరకు దాదాపు 53 వేల మందికి పైగా వైద్యులను నియమించామని వివరించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో స్పెషలిస్టు వైద్యులు 3.96శాతం మాత్రమే ఉండగా, రాష్ట్రంలో 61శాతం వరకు ఉన్నారన్నారు. 26శాతం నర్సింగ్‌ పోస్టులు, 33శాతం ల్యాబ్‌టెక్నీషియన్‌ పోస్టులు జాతీయ స్థాయిలో కొరత ఉండగా, రాష్ట్రంలో ఈ రెండు విభాగాల్లో పోస్టులు పూర్తిస్థాయిలో భర్తీ చేశామని అన్నారు.
టిడిపి హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీని బలోపేతం చేశామని పేర్కొన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ వర్తించే వ్యాధులను, జబ్బులను 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంచామన్నారు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వెచ్చించామని చెప్పారు. గతంలో జగనన్న సురక్ష ద్వారా 93 లక్షల డాక్యుమెంట్స్‌ ఇచ్చామని గుర్తుచేశారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భతి చెల్లిస్తున్నామని, ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు ప్రభుత్వం అందించిందని తెలిపారు.
కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విటి కృష్ణబాబు, ఎపిఎంఎస్‌ఐడిసి ఎమ్‌డి మురళీధర రెడ్డి, కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్‌పి ఎం.దీపిక, డిప్యూటీ సిఎం రాజన్నదొర, మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.