ఏలూరు జిల్లాకేంద్ర ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి దారుణం
మెడికల్ కళాశాలగా మారుతున్నా అందని సేవలు
450 బెడ్ల నుంచి 350కు కుదింపు
సీనియర్ డాక్టర్లు మొత్తం బదిలీ
అత్యవసర కేసులన్నీ విజయవాడకు రిఫర్
ఎవరు విధుల్లో ఉంటారో తెలియని పరిస్థితి
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి మెడికల్ కళాశాలగా మారడం ప్రజలకు ఉపయోగకరమో.. నష్టదాయకమో అర్ధంకాని దుస్థితి నెలకొంది. మెడికల్ కాలేజీ వస్తే మరిన్ని వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా ఇప్పటి వరకూ కొనసాగిన వైద్యసేవలు సైతం అందకుండా పోతున్నాయి. జనరల్ ఆసుపత్రిగా మారిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఆసుపత్రి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడడం, అందరిని సరైన క్రమంలో నడపడంలో విఫలం కావడంతో పరిస్థితి దారుణంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రోజుకు వెయ్యి నుంచి 1200 మంది అవుట్ పేషెంట్‌లు వస్తుంటారు. 450 బెడ్స్ అందుబాటులో ఉండేవి. ఉమ్మడి పశ్చిమగోదావరిలో ఇబ్బందికర కేసులన్నింటినీ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేస్తారు. ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్స్ అందుబాటులోకి రాకుండానే సీనియర్ డాక్టర్లను వేర్వేరు ఆసుపత్రులకు బదిలీచేశారు. దీంతో ఆసుపత్రిలో సరైన వైద్యసేవలు అందకుండా పోతున్నాయి. జూనియర్ డాక్టర్లతోనే నెట్టుకొస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు, పాయిజన్, పాముకాటు వంటి కేసులను సైతం విజయవాడ లేదా గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఏదైనా అత్యవసర కేసులైతే మాత్రమే విజయవాడకు రిఫర్ చేసేవారు. ఇదేమని అడిగితే బెడ్స్ లేవంటూ డ్యూటీ డాక్టర్ సమాధానం చెబుతున్నారు. దీంతో రోగుల పరిస్థితి దారుణంగా మారింది. జనరల్ ఆసుపత్రిగా మారినట్లు కాగితాల్లో తప్ప వైద్యసేవలు మాత్రం అందించడం లేదు. స్పెషలిస్టు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తూ జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది. వైద్యసేవలు జనాలకు మరింతగా అందేందుకు ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ తీసుకురాగా, ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యసేవలు పూర్తిగా దారితప్పుతున్నాయి. గైనకాలజీ విభాగంలోనూ సీనియర్ డాక్టర్లు వెళ్లిపోవడంతో వైద్యసేవలు సరిగా అందక గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎక్స్‌రే తీస్తే రిపోర్ట్ రోగులకు ఇచ్చేవారు. ఇప్పుడు డాక్టర్ల గ్రూపులో పెట్టి అక్కడకు వెళ్లాలని చెబుతున్నారు. తీరా అక్కడకు వెళితే వారు సరైన సమాధానం చెప్పడం లేదని రోగులు వాపోతున్నారు. రోగులకు తమ ఎక్స్‌రే రిపోర్ట్ చూసుకునే పరిస్థితి కూడా లేకుండా చేశారు.
ఎప్పుడు ఏ డాక్టర్ ఉంటారో తెలియని అయోమయం..
ఏలూరు జనరల్ ఆసుపత్రిలో వైద్యులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియడం లేదంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా రోగి ఓ డాక్టర్ వద్ద చూపించుకుని మందులు తీసుకుని వెళ్తే రెండోసారి మందులకు వచ్చేసరికి ఆ డాక్టర్ కనిపించడం లేదు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. దీంతో ఆ రోగి ఆసుపత్రి అంతా తిరిగితిరిగి అలసిపోతున్నాడు. వేరే డాక్టర్ వద్దకు వెళితే ముందు చూసిన డాక్టర్‌నే కలవాలంటూ సమాధానం చెబుతున్నారు. దీంతో రోగులకు వేరే గత్యంతరం లేక మళ్లీ ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆసుపత్రి పర్యవేక్షణ అధికారులు తమకు ఏమీ సంబంధంలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఏలూరు ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలపై దృష్టిసారించి సమస్యలను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. అత్యవసర కేసులకు వైద్యం అందేవిధంగా చూడాలని అంతా వేడుకుంటున్నారు. సీనియర్ డాక్టర్లను నియమించి వైద్యసేవలందించాలని అంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.










