ప్రజాశక్తి - విశాఖపట్నం : వైద్య సదుపాయాల కల్పనలో ఎలాంటి రాజీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. కెజిహెచ్‌లో రూ.68 లక్షల వ్యయంతో అత్యాధునిక వసతులతో నిర్మించిన మార్చురీ వార్డును శనివారం సాయంత్రం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మండలానికి ఒక పిహెచ్‌సి ఉండేదని, ఈ రోజు మండలానికి రెండు పిహెచ్‌సిలను తీసుకొస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ ఫిజిషియన్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారని తెలిపారు. దీనివల్ల ఒక్కో పిహెచ్‌సి పరిధిలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులోకి వస్తారని, ఒకరు పూర్తిగా క్షేత్ర స్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారని వివరించారు. మూడు వేల రోగాలకు ఉచితంగా దాదాపు అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందిస్తున్నామని తెలిపారు వైద్య సేవల్లో సంస్కరణల దిశగా రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పనిచేస్తోందని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి ప్రజల ఆరోగ్యం కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఉచితంగా కేన్సర్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. కిడ్నీ రోగులకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా పలాసలో కిడ్నీ రీసెర్చి అండ్ డయాలసిస్ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఇలా ప్రతి రోగానికి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోందని అన్నారు. మేయర్ గొలగాని హరివెంకట కుమారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, వాసుపల్లి గణేష్ కుమార్, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.మైథిలి, ఎఎమ్‌సి ప్రిన్సిపాల్ బుచ్చిరాజు పాల్గొన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం
పిఎం పాలెం : జివిఎంసి 7వ వార్డు సమీపంలోని వాంబే కాలనీలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ, అర్బన్ ప్రాథమిక ఆసుపత్రుల ద్వారా ప్రజల వద్దకే మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఎంపీ ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ, పేద ప్రజలకు సంక్షేమ పాలనను జగన్మోహన్‌రెడ్డి అందిస్తున్నారని చెప్పారు.










