Nov 29,2022 23:48

రక్తహీనతతో బాధపడుతున్న మహిళను చింతపల్లి ఏరియా ఆసుత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ హిమబిందు తదితరులు (ఫైల్‌ ఫొటో)

ప్రజాశక్తి- సీలేరు
గూడెం కొత్తవీధి మండలం దారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డికె.హిమబిందుకు రాష్ట్ర హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ జె.నివాస్‌ ఉత్తమ సేవ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ ప్రశంసా పత్రాన్ని మంగళవారం పోస్ట్‌ ద్వారా పంపించారు. ఈ నెల 10వ తేదీన ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమంలో భాగంగా పిహెచ్‌సి వైద్యాధికారి హిమబిందు గుమ్మిరేవుల గ్రామాన్ని సందర్శించి, ఇంటికి వెళ్లి వైద్య సేవలు అందించారు. ఓ గృహంలో తీవ్ర అనారోగ్యంతో కుతుర తులసి బాధపడుతూ ఉండడానికి గుర్తించి ఆమెకు రక్త పరీక్షల నిర్వహించగా నాలుగు గ్రాములు హెచ్‌బి (హిమోగ్లోబిన్‌) ఉన్నట్టు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా బాధితురాలు నిరాకరించింది. దీంతో వైద్యాధికారి గ్రామ పెద్దలు సహకారంతో బలవంతంగా చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ హిమబిందును అభినందిస్తూ ఉత్తమ సేవా ప్రశంసా పత్రానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హిమబిందు మాట్లాడుతూ ప్రశంసా పత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఆదివాసీలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.