ప్రజాశక్తి-హిందూపురం : వైద్యవిద్యను వ్యాపారం చేయడం సిగ్గు చేటని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి విమర్శించారు. గురువారం పట్టణంలోని బీసీ వసతి గహంలో ఆయన మాట్లాడుతు వైద్య విద్య సీట్ల భర్తీలో విద్యా వ్యాపారానికి ఎర్రతివాచి పరిచి బలహీన వర్గాల విద్యార్ధులను వైద్యవిద్యకు ప్రభుత్వం దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి ఐదు వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకుని, నేడు ఆ కళాశాలలను వ్యాపార కేంద్రాలుగా తయారుచేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన 107, 108 జీవోల ద్వారా ఇది తేటతెల్లమవుతోందన్నారు. మూడు కేటగిరిలుగా సీట్లను భర్తీ చేసి వాటిలో 50శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్‌ఆర్‌ఐ కేటాయించడంతో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ విద్యార్ధులకు దోహ్రం చేస్తున్నారని అన్నారు. 25శాతం సీట్లను మాత్రమే రిజర్వ్ సీట్లును కేటాయించడం ఏమటని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం తెలంగాణలో నూతన కళాశాలలు ప్రారంభిస్తున్నా కన్వీనర్ కోటాలోనే సీట్లను భర్తీ చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యలో విప్లవాత్మమైన మార్పులు చేస్తున్నారంటే అది బలహీన వర్గాల ప్రజలకు విద్యను దూరం చేయడమేనా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో డబ్బు ఉన్నవాడికి పేద వాడికి వార్ జరుగుతుందని చెప్తున్న సిఎం సీట్ల కేటాయింపుతో ఎవరి పక్షమో ప్రజలకు అర్ధమైందన్నారు. వెంటనే ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని పేద విద్యార్ధులకు వైద్య విద్యకై కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్, జయచంద్ర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.










